లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో(ఎల్‌ఐసీ)(Life Insurance Corporation) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ)(Foreign direct investment) అనుమతినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, సంస్థ తొలి పబ్లిక్ ఆఫర్‌లో(ఐపీఓ) విదేశీ పెట్టుబడిదారులూ పాల్గొనే వీలు కలుగుతుంది. ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐ(FDI in Lic) అనుమతికి సంబంధించిన ప్రతిపాదనపై ఆర్థిక సేవల విభాగం, పెట్టుబడులు- ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) మధ్య.. కొన్ని వారాలుగా చర్చ నడుస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో అంతర్‌మంత్రిత్వ శాఖల మధ్య కూడా చర్చ జరుగుతుందని, అనంతరం మంత్రివర్గ ఆమోదం అవసరం అవుతుందని వివరించాయి.
ప్రాథమిక దశలో చర్చలు..
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఎల్‌ఐసీలో ఎక్కువ వాటాను ఒకటే విదేశీ పెట్టుబడి సంస్థ కొనుగోలు చేసేలా వీలు కల్పించాలన్నది ప్రతిపాదన. అయితే వ్యూహత్మక పెట్టుబడికి పరిమితి అనేది ఉంటుంది. మరి ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐకి సంబంధించి ఎంత మేర పరిమితిని ప్రభుత్వం విధిస్తుందనేది ఇప్పటివరకైతే స్పష్టత లేదని ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 20 శాతం ఎఫ్‌డీఐ అనుమతించాలని భావిస్తున్నారని సమాచారం. ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐని(FDI in Lic) అనుమతినిచ్చే అంశంపై చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.
ఇప్పటికే దేశీయ బీమా రంగంలో 74% వరకు ఎఫ్‌డీఐకి నేరుగా అనుమతి ఉంది. కానీ ఈ నిబంధన ఎల్‌ఐసీకి వర్తించదు. పార్లమెంటులో చట్టం చేసి ఓ ప్రత్యేక సంస్థగా దీనిని ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. ఇప్పుడు.. ఎల్‌ఐసీలోకి ఎఫ్‌డీఐ అనుమతినిస్తే.. అతిపెద్ద విదేశీ పెన్షన్ ఫండ్‌లు, బీమా సంస్థలు దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా భావిస్తున్న ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూలో పాల్గొనే వీలుంటుంది. దేశీయ సంస్థలో 10% అంతకంటే ఎక్కువ వాటాను కొనే విదేశీ వ్యక్తి / సంస్థను ఎఫ్‌డీఐగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reseve Bank of India) గుర్తిస్తుంది.
ఇదీ చూడండి: చదువు అంతంతే.. సంపద మాత్రం రూ.లక్షల కోట్లు!
ఇదీ చూడండి: '2021-22 క్యూ1లో వృద్ధి రేటు 18.5 శాతం'.. కానీ...