ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద ప్రయోజనం పొందేందుకు రాబోయే నాలుగున్నరేళ్లలో రూ.3,345 కోట్ల విలువైన పెట్టుబడులు పెడతామంటూ పలు కంపెనీలు సమర్పించిన 31 ప్రతిపాదనలకు టెలికాం విభాగం ఆమోదం (డాట్) తెలిపింది. ఈ పథకం కోసం అర్హత పొందిన విదేశీ కంపెనీల్లో నోకియా, జాబిల్ సర్క్యూట్స్, ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, సాన్మినా- ఎస్‌సీఐ, రైజింగ్ స్టార్ ఉన్నాయి. దేశీయ సంస్థల్లో డిక్సన్ టెక్నాలజీస్, టాటా గ్రూపు సంస్థ ఆకాశస్థ టెక్నాలజీస్, తేజాస్ నెట్‌వర్క్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్, శిర్మా టెక్నాలజీ, ఐటీఐ లిమిటెడ్, నియోలింక్ టెలి కమ్యూనికేషన్స్, వీవీడీఎన్ టెక్నాలజీస్‌లు అర్హత సాధించాయి.
ఈ ప్రతిపాదనల ప్రకారం.. మొత్తంగా రూ.3,345 కోట్ల పెట్టుబడులను ఆయా కంపెనీలు పెట్టనున్నాయి. ఫలితంగా రూ.1.82 లక్షల కోట్ల మేర ఉత్పత్తి పెరిగేందుకు అవకాశం ఉండగా.. 40,000కి పైగా ఉద్యోగాల సృష్టి జరగనుంది. 'ఏ ఉత్పత్తిని తయారుచేసినా.. ప్రపంచ శ్రేణి నాణ్యతను కలిగి, అందుబాటు ధరల్లో లభ్యమయ్యేదిలా ఉండాలి. రూ.3,345 కోట్లు.. పెద్ద మొత్తమేమీ కాదు. నిర్దేశిత స్థాయికి తగినట్లుగా మీ ఉత్పత్తి ఉంటే.. మీకు మరింతగా ప్రోత్సాహం అందించాలని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఒక ఉత్ప్రేరకంగా మీకు సహకారం అందిస్తుంది' అని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు.
దేశీయంగా కొత్త ఉత్పత్తులపై పరిశోధన, తయారు చేయడం పెరిగేందుకు ఈ పథకం దోహదం చేసే అవకాశం ఉంది. పీఎల్‌ఐ పథకం ద్వారా భారత్‌ను టెలికాం పరికరాల తయారీ కేంద్రంగా మార్చాలని అనుకుంటున్నామని మంత్రి చెప్పారు. పీఎల్‌ఐ కింద అర్హత సాధించిన కంపెనీల్లో 16 ఎంఎస్‌ఎమ్‌ఈలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) ఉన్నాయి. పీఎల్‌ఐ పథకంతో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని టాయ్ డైరెక్టర్ జనరల్ ఎస్‌పి కొచ్చర్ అన్నారు. కాగా.. వచ్చే ఐదేళ్లలో రూ.12,195 కోట్ల మేర ఆర్థిక సాయం అందించే ప్రణాళికలతో టెలికాం, నెట్‌వర్కింగ్ సంస్థలకు పీఎల్‌ఐ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 24న డాట్ నోటిఫై చేసిన సంగతి తెలిసిందే.
డిక్సన్ రూ.200 కోట్ల పెట్టుబడులు
ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ పీఎల్‌ఐ పథకం కింద రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టాలని అనుకుంటుంది. ఇందులో భాగంగానే భారతీ గ్రూపునకు చెందిన లుథియానా ప్లాంటును కొనుగోలు చేయనుంది. ఈ ప్లాంటులోనే టెలికాం గేర్స్ తయారీని ప్రారంభించనుందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'రిలయన్స్' మరో ఘనత.. ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుంచి ఫస్ట్