ఇంటి ముందు ఖాళీ ప్రదేశాలుంటే ఏంచేస్తాం...కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలో నాటుతాం. వీటంన్నిటికీ వినూత్నంగా ఆలోచించారు కంకిపాడుకు చెందిన ఓ గృహిణి. తన తండ్రికి వచ్చిన ఓ వ్యాధి చికిత్సకు అవసరమైన మొక్కలు లభించడం కష్టతరమైంది. ఆ పరిస్థితి మరోకరికి రాకూడదనే ఆలోచనతో ఇంటిపెరటిలో 150 రకాల ఆయుర్వేద, పూలు, పండ్ల మొక్కలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెం గ్రామానికి చెందిన దేవిరెడ్డి జ్యోతి...ఇంటి పెరటిలో 150 రకాల మొక్కలు పెంచుతున్నారు. ఉన్న కొద్ది ప్రదేశంలో ఆయుర్వేద, ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. జ్యోతి తండ్రికి వచ్చిన బోన్ క్యాన్సర్ చికిత్సకు ఆయుర్వేద మొక్కలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ ఆలోచనతోనే పలు వ్యాధుల నిర్మూలనకు ఉపయోగపడే మొక్కలు పెంచడం ప్రారంభించారు. వీటితోపాటు కుటుంబ అవసరాలకుపయోగపడే పండ్లు, కూరగాయ, పూల మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నారు.
ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులకు మొక్కలను బహుమతులుగా అందిస్తారు. వివాహ, శుభకార్యాలకు మొక్కలనే గిఫ్ట్‌లుగా ఇస్తారు జ్యోతి. అరుదైన ఆయుర్వేద, సుగంధ ద్రవ్యాలు, వివిధ జాతుల మొక్కలు పెంచుతూ ఇంటి ఆవరణను పచ్చిన మొక్కలమయంగా మార్చేశారు జ్యోతి.