వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం....
వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కడప, పులివెందులపై తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ వివేకానందరెడ్డి... అన్నచాటు తమ్ముడిగా ఉంటూ వైఎస్ఆర్‌కు బాసటగా నిలిచారు. 1950, ఆగస్టు 8న జన్మించిన వైఎస్ వివేకానందరెడ్డి.. వైఎస్ కుటుంబంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరువాత రాజకీయాల్లో రాణించిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. పులివెందుల నుంచి 1989, 1994లో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వైఎస్ వివేకా... 1999, 2004లో కడప ఎంపీగా గెలుపొందారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసిన సమయంలో పులివెందుల ఎమ్మెల్యేగా... వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో కడప ఎంపీగా బరిలోకి దిగిన వైఎస్ వివేకానందరెడ్డి... కడప జిల్లాను తమ కుటుంబానికి కంచుకోటగా మార్చడంలో తనవంతు కృషి చేశారు. 2009లో కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడంతో... వైఎస్ వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగిన వైఎస్ వివేకానందరెడ్డి... కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు.
కొంతకాలం క్రితం జరిగిన కడప జిల్లా స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు వైకాపా వ్యవహారాలను చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి... కొద్ది రోజులుగా లోటస్‌పాండ్‌లోనే ఉంటూ పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. గురువారం పులివెందులలో వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు వైఎస్ వివేకానందరెడ్డి. పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను తనపై వేసుకుని ప్రచారం చేపడుతున్న వివేకానందరెడ్డి హఠాన్మరణంతో వైకాపా శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్య, ఒక కుమార్తె ఉన్నారు.