పారిశ్రామిక రంగానికి, వ్యాపార సంస్థలకు చెడ్డపేరు తీసుకొచ్చే నల్లగొర్రెల్లాంటి ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయం కల్పించొద్దని ప్రపంచ దేశాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య కోరారు. భారత ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యాను భారత ప్రభుత్వం త్వరలో యూకే నుండి భారత్‌కు రప్పించనుందనే వార్తల నేపథ్యంలో వెంకయ్య ఈ వాఖ్యలు చేశారు. ఆర్థిక నేరాలు దేశ ఆరోగ్యానికి, సంపదకి హానికరమని వెంకయ్య పేర్కొన్నారు.
పార్లమెంట్ సమావేశాలపై స్పందిస్తూ... రాజకీయ పార్టీలు తమ ఎంపీ,ఎమ్మెల్యేలకు సభా నిబంధనల గురించి తేలియజేయాల్సిన సమయం వచ్చిందని వెంకయ్య స్పష్టం చేశారు.
ఎన్నికల్లో గెలుపుకోసం హద్దు మీరి పథకాలు ప్రకటించొద్దని రాజకీయ పార్టీలకు వెంకయ్య హితవు పలికారు. ప్రజలు ప్రతీ విషయానికి ప్రభుత్వం మీద ఆధారపడకుండా, స్వయంశక్తితో నిలబడేలా పాలకులు వ్యవహరించాలని వెంకయ్య సూచించారు.
పాలన సక్రమంగా సాగాలంటే కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు సమన్వయం అవసరమని వెంకయ్య పేర్కొన్నారు.
మౌళిక రంగంలో వసతుల లేమి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యని వెంకయ్య అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వీటిపై దృష్టిసారించిదనీ... రోడ్లు,పోర్టుల అభివృద్ధితో పాటు దేశీయ విమాన రంగాన్ని ప్రోత్సహిస్తోందని వెంకయ్య పేర్కొన్నారు. మౌళిక రంగ అభివృద్ధికి ప్రైవేటు-ప్రభుత్వ రంగ భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టాలని వెంకయ్య సలహా ఇచ్చారు. మీడియా రంగం నైతిక విలువలు పాటించాలని సూచించారు వెంకయ్య.