వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించి వాటిని ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలంటూ.. దేశవ్యాప్త పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు మరో కొత్త ప్రశ్నను తెరపైకి తెచ్చింది. ఒక వీవీ ప్యాట్‌లో ముద్రితమయ్యే స్లిప్‌ల సంఖ్య 1500 మాత్రమేనని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. అయితే 1500కు మించి ఓటర్లు ఉన్న బూత్‌లలో.. అంతకుమించి ఓట్లు పోలైతే పరిస్థితి ఏంటన్న ప్రశ్న తెరపైకి తెచ్చింది. అవన్నీ వీవీ ప్యాట్లలో స్లిప్‌ల రూపంలో నిక్షిప్తమవుతాయా లేదా అన్న అనుమానాన్ని ఎన్నికల సంఘం ముందు లేవనెత్తింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈవీఎం, వీవీప్యాట్లలో ఓట్లకు తేడా వస్తే ఏం చేస్తారు
కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించిన ‘'హ్యాండ్ బుక్ ఫర్ ఏజెంట్'’ అనే పుస్తకంలోనూ ఒక వీవీ ప్యాట్‌లో 1500 స్లిప్‌లే ముద్రితమవుతాయని స్పష్టం చేసింది. అందులోనూ 100 స్లిప్‌లు మాక్ పోలింగ్ కింద పోతాయనీ.. మిగిలిన పేపర్ ద్వారా పోలైన ఓట్లలో 1400 ఓట్లు మాత్రమే ముద్రించడం వీవీప్యాట్లకు సాధ్యమని ఈసీ వివరించింది. ఓట్ల లెక్కింపు రోజున వీవీప్యాట్లు ర్యాండమ్ పద్ధతిలో లెక్కించడానికి తీసుకున్నప్పుడు.. ఈవీఎంలలో 1500 మించి ఓట్లు కన్పించి.. వీవీప్యాట్లలో 1400 మించి కన్పించకపోతే ఎలా సరిపోల్చుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తేడా ఆధారంగా నియోజకవర్గం మొత్తం రీకౌంటింగ్ చేసినా అక్కడ 1500కు మించి పోలైన అన్ని యంత్రాల్లోనూ ఈ లోటు కన్పిస్తుంది. కాబట్టి కచ్చితత్వం అనేదే రాదని తెదేపా బలంగా వాదిస్తోంది. 2వేల ఓటర్లు ఉన్న ప్రతి బూత్‌లోనూ ఇదో పెద్ద సమస్యగా మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఈవీఎం, వీవీప్యాట్ స్లిప్‌లలో తేడాలు వస్తే వీవీప్యాట్ల ఆధారంగానే గెలుపు నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఈసీ నిబంధనలు చెబుతున్నాయి. మరి ఈవీఎం, వీవీప్యాట్లలో పోలైన ఓట్లకు వ్యత్యాసం వస్తే ఏం చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని తెదేపా డిమాండ్ చేస్తోంది.
ఇవీ చదవండి..