ప్రకాశం జిల్లాలో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురు నిందితులను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నుంచి ఈనెల 16న స్నేహితుడిని కలిసేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు బాధిత బాలిక వెళ్లింది. ఒంటరిగా ఉన్న అమ్మాయికి ఆశ్రయం కల్పిస్తానని..షేక్ బాజీ అనే సెల్‌ఫోన్ మెకానిక్ నమ్మించి తన రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
ఐదుగురు దుర్మార్గులు ఒక్కటై...
అక్కడితో ఆగకుండా మరో ఐదుగురు స్నేహితులతో కలిసి 4 రోజులపాటు ఈ దాష్టీకం కొనసాగించాడు. అనంతరం శనివారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్‌లో బాలికను వదిలివెళ్లారు. బాధితురాలి పరిస్థితిని గమనించిన హోం గార్డు శక్తి టీమ్‌కు సమాచారమిచ్చాడని.. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. రంగంలోకి దిగిన శక్తి టీం పోలీసులు శనివారం సాయంత్రానికి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని ఇవాళ అరెస్ట్‌చేశారు.
నిందితుల్లో ముగ్గురు మైనర్లు
ప్రధాన నిందితుడు షేక్ బాజీ పాలిటెక్నిక్ చదువు మధ్యలో ఆపేసి సెల్‌ఫోన్ రిపేర్ షాపులో పనిచేస్తున్నాడు. సంతనూతలపాడు మైనంపాడు గ్రామానికి చెందిన ఇతడికి గతంలో విద్యుత్ షాక్ కొట్టి రెండు చేతులు కోల్పోయాడు. నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నారని ఎస్పీ వెల్లడించారు. కేసు సమగ్రంగా దర్యాప్తు చేసి..కఠిన శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.