చేసే పని సమానం. ఒక్కోసారి మగవారి కన్నా ఎక్కువే. అయినా... వేతనాల్లో మాత్రం ఎంతో వ్యత్యాసం. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళలపై కొనసాగుతున్న దోపిడి. సమానపనికి సమాన వేతనాలు ఇవ్వడంలో అన్ని దేశాలు మహిళల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయి. స్త్రీ లేని రంగమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. అన్నిరంగాల్లోనూ ఆమె భాగస్వామ్యం. పురుషుల కన్నా అధికంగా శ్రమపడుతున్నా కష్టానికి ఫలితం లేదు. పురుషులతో సమానంగా చూడ్డంలేదు సరికదా.. వారు పొందే వేతనాల్లో, ఉద్యోగ ప్రమోషన్లలో సగం వంతైనా న్యాయం జరగడంలేదు.
పెళ్లాయ్యాక కష్టపడలేవు
గీత, రామ్ ఇద్దరూ ఒకేరోజు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ జాబ్‌లో జాయినయ్యారు. గీత తెలివైన అమ్మాయి. రామ్‌కి ఏదైనా నాలుగైదుసార్లు చెబితేకానీ అర్థంకాదు. గీత కంపెనీలో సమయానికి చేయదగ్గ పనుల్ని ఎప్పటికప్పుడు పూర్తిచేసేది. అందుకోసం సమయం తెలియకుండా కష్టపడేది. కంపెనీలోనూ సిన్సియర్ వర్కర్ అని మంచి పేరు. కానీ ప్రమోషన్ లిస్టులో రాము పేరు మాత్రమే ఉంది. అది చూసిన గీత నేరుగా బాస్ దగ్గరకెళ్లి 'సార్ ఎక్కడో పొరబాటు జరిగినట్లు ఉంది. ప్రమోషన్ లిస్ట్‌లో నా పేరు లేదు ఎందుకని?' అని అడిగింది. 'నీకు ప్రమోషన్ ఇవ్వం. గీతా..నువ్వు నిజంగానే కష్టపడ్డావు. కాదనడం లేదు. కానీ రేపు నీకు పెళ్లైతే ఇంతలా కష్టపడలేవు. రామ్ అయితే పెళ్లైనా, పిల్లలు పుట్టినా ఎలాంటి మార్పూ ఉండదు' అన్నాడు బాస్. 'కేవలం అమ్మాయిననే నెపంతో నా కెరీర్‌ను బలి చేయడం ఎంతవరకు సమంజసం?' అంటూ ప్రశ్నించిన గీతకు సమాధానం రాలేదు. చేసేదేమీ లేక మౌనంగా ఛాంబర్‌లో నుంచి బయటకు వచ్చేసింది.
ఆడదానికి సగం కూలే ఎక్కువ
ఆమె పేరు రూప. ఇద్దరు పిల్లలు. రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయింది. చదువురాని ఆమె, బతుకుదెరువు కోసం బిల్డింగ్ పనుల్ని ఎంచుకుంది. ఉదయాన్నే పనికిపోయి, పొద్దుపోయే వరకూ కష్టపడేది. వారం తర్వాత కూలీ కోసం మేస్త్రీ ఇంటికెళ్లింది. ఆమెకు సగం కూలీ మాత్రమే ఇచ్చాడు మేస్త్రీ. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగింది. అంతే అక్కడున్న వాళ్లంతా నవ్వారు. 'ఆడదానికి సగం కూలే ఎక్కువ. నీవేమన్నా మగాడివా.. పూర్తి కూలీ ఇవ్వడానికీ?' అక్కడే ఉన్న మరో కూలీ వెటకారంగా అన్నాడు. 'అయ్యా నేను మీలాగే కష్టపడ్డా కదా?! మరి కూలీలో ఎందుకింత తేడా?' అంటూ కన్నీళ్లతో వెనుదిరిగింది.
గీత, రూప మాత్రమేకాదు, ఇలా చాలామంది మహిళా ఉద్యోగులు, శ్రామికులు రోజువారీ పనుల్లో, కష్టంలో, వేతనాల్లో ఎరుర్కొంటున్న సమస్యలు అనేకం.
మహిళ అనేది అనర్హతా?
ఆధునిక మహిళ నేడు పురుషునితో సమానంగా విద్యన భ్యసించి, అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది. అయినా శ్రామికరంగాన వెనుకబడే ఉంది.
పురుషుని కన్నా 24శాతం తక్కువ వేతనమే మహిళలకు దక్కుతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితులపట్ల ఇప్పటికే 68.5 శాతం మంది మహిళలు అసంతృప్తితో ఉన్నారు. ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. సర్వేలో వెల్లడైన విషయాల ప్రకారం.. సమా జంలో పదో న్నతి అవకాశాల్లో మహిళలకన్నా పురుషునికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది.
ఉద్యోగినులు ఏమంటున్నారు?
పురుషులతో సమానంగా మాలో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కేవలం స్త్రీ అనే కారణంతో పదోన్నతులు రానియ్యడం లేదన్నది మెజార్టీ ఉద్యోగినులు చెప్తున్న మాట.
మహిళలకు అన్నింటిలోనూ సమానావకాశాలు కల్పించాలని చర్చలు జరుగుతున్నప్పటికీ,ఇలాంటివేమీ అమలు కావడం లేదన్న అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది.
⦁ పురుషునికే ఎక్కువగా పదోన్నతి అవకాశాలు కల్పిస్తూ ,పరిమితులను వారే నిర్ణయిస్తున్నారని 62.4 శాతం మంది మహిళలు చెబుతున్నారు.
⦁ వివిధ అంశాలలో యాజమాన్యం తమతో చర్చించే సందర్భాలూ చాలా తక్కువేనంటున్న 68.5 శాతం మంది
⦁ ఆఫీసుల్లో పిల్లలకు తగిన సంరక్షణ లేనందున మాతృత్వం లభించిన వెంటనే బలవంతంగా ఉద్యోగాలు మానేయడం, సెలవులు తీసుకోవాల్సి వస్తోందని ఇంకొంతమంది ఉద్యోగ మహిళలు చెప్పారు.
⦁ సదుపాయాలు లేకపోవడం మహిళా ఉద్యోగినులకు అతిపెద్ద సవాలని 13.1 శాతం ఉద్యోగినులు అభిప్రాయపడ్డారు.
దారుణమైన విషయం
సమాజానికి ఉపయోగపడే పనిలో స్త్రీ శ్రమ 2/3 శాతం ఉంటే, పురుషుని శ్రమ 1/3 శాతం ఉంటుందని అనేక సర్వేల్లో తేలింది. అసంఘటిత కార్మికుల వేతనాలలో చాలా వ్యత్యాసం ఉంది. అర్హత ఉన్న మహిళలకూ ప్రమోషన్స్ ఇవ్వకపోవడం దారుణమైన విషయం.
- ప్రియాంక చోప్రా
చట్టరీత్యా నేరం
పనిలో ఆడ, మగ తేడా లేదు. కాబట్టి ఇద్దరికీ సమాన వేతనం ఇవ్వకపోవడం లింగవివక్ష కిందకు వస్తుంది. ఇది చట్ట వ్యతిరేకం. సమాన వేతనం కోసం లేబర్ కోర్టులో కేసు వేసి, పోరాటం చేయవచ్చు.
- రాజేంద్ర ముఖర్జీ-అడ్వకేట్
సమాన కూలీ ఇవ్వాలి
నేను బిల్డింగ్ పనులు చేస్తుంటా. మాకు ఇచ్చే కూలి పురుషుల కంటే చాలా తక్కువ. అదేంటని అడిగితే పనికి వస్తే రా! లేకపోతే మానుకో!! అంటారు. ఇదెక్కడ న్యాయం?
- లక్ష్మి, విజయవాడ.
ప్రశ్నించడమూ తప్పే
ప్రయివేటు కంపెనీల్లోనూ స్త్రీ, పురుష వేతనాల్లో చాలా తేడా ఉంటుంది. ఇదేంటని అడిగిన వాళ్ళను ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితులూ ఉన్నాయి. పైగా ప్రశ్నించడమే తప్పుగా భావిస్తున్నారు.
- సంజన
అన్నీ మాటలే
నేను పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ని. చాలా ఆఫీసుల్లో స్త్రీలను చులకనగా చూడటం, వారి గురించి తక్కువగా మాట్లాడం కళ్లారా చూశా. స్త్రీని గౌరవించాలి అనే మాటలు కేవలం ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇది బాధాకరం.
- మేఘన
ధైర్యంగా జీవించండి: రవిశంకర్
మహిళఅంటేనే ధైర్యం... ఆకాశాన్నైనా తాకగల శక్తి మహిళలకు ఉంది... కానీ ఇంకా కొద్ది మంది మహిళల్లో ఆత్మన్యూనత ఎక్కువగా ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపకర్త శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ అన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
విదేశాల్లో ఎలా ఉంది?
. పురుషులకు ఎక్కువ వేతనాలు ఇస్తూ.. మహిళలకు తక్కువ వేతనం ఇవ్వడం అన్యాయం అని, సమాన వేతనం చట్టాన్ని తీసుకొచ్చింది ఐస్ లాండ్.ఏవైనా సంస్థలు ఫాలో కాకపోతేచట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.. 25 మంది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థ సమానవేతనాలు అందజేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు అందుకోవాలని... లేకపోతే జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని చెప్పింది.
ఇప్పటికే వరల్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వమిస్తున్న గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్‌లో... అత్యధిక లింగ సమానత్వం కలిగిన దేశంగా ఐస్‌ల్యాండ్ తొమ్మిదేండ్లుగా మొదటిస్థానాన్ని అందుకుంటోంది.
2020 కల్లా స్త్రీ, పురుష వేతనాల్లో వ్యత్యాసాన్ని పూర్తిగా నిర్మూలించాలని నడుం కట్టింది. ఐస్‌ల్యాండ్ తీసుకున్న నిర్ణయానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలనుంచి పూర్తి మద్ధతు లభించింది.
మహిళ ఏ హోదాలో ఉన్నా మగవారిదే పెత్తనం
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా మహిళలకు రాలేదు
దేవత అని పొగడక్కర్లా.. మనుషుల్లా చూడండి
ఉత్తరప్రదేశ్ మంత్రి స్వాతి సింగ్
‘‘దేశాన్ని శాసించే స్థానంలో ఉన్న మహిళపై కూడా పురుషుడు పెత్తనం ఉంది.
మహిళా మంత్రి అయినప్పటికీ ఇంటికి వెళితే నా భర్త చెప్పిందే చేస్తా. మహిళ ఎంత విద్యావంతురాలైనా.. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పురుషుల పెత్తనం స్త్రీలపై ఏ మాత్రం తగ్గలేదు’’ అని ఉత్తరప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్ అన్నారు.
మార్పు రావాలి!
'మగవారి కంటే ఆడవాళ్లు తక్కువే సంపాదించాలి. ఎందుకంటే వాళ్లు బలహీనులు, చిన్నవాళ్లు, వాళ్లకు పురుషుల కంటే తెలివి తక్కువే' ఈ మాటలు అన్నది ఓ మామూలు
వ్యక్తికాదు, పోలాండ్‌కు చెందిన జానూస్ కొర్విన్ మిక్కీ అనే రాజకీయవేత్త. ఈ మాటలు ఆ మధ్య యూరోపియన్ పార్లమెంట్ సమావేశాల్లో స్త్రీ, పురుషుల మధ్య వేతన వ్యత్యాసాలపై చర్చ జరుగుతున్న సమయంలో మాట్లాడినవి.
ఏమీ చేయాలి?
పాలకులు ఏర్పాటు చేసే వ్యవస్థీకృత విధానాలు, చేసే చట్టాల్లోని లొసుగులు కారణంగా మహిళలు పనిచేసే చోట సరైన న్యాయం జరగడం లేదు. హక్కులు ఉండటం లేదు.
పనిచేసే కార్యాలయాల్లో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం రావాలంటే శ్రమశక్తిలో పారదర్శకత ఉండాలి.
హక్కుల సాధనలోనూ సమన్యాయం ఉండాలి.
అబ్బాయి చదువుకుంటే ఒక కుటుంబానికే లాభమని, అదే అమ్మాయి చదివితే ప్రపంచానికే విద్యనేర్పిస్తుంది.. స్త్రీ, పురుష సమానత్వం గురించి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి.