కొత్త విద్యా సంవత్సరం కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు ముందుగానే సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి పాఠశాలలు తెరుస్తున్న దృష్ట్యా... నెల రోజుల ముందునుంచే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
పుస్తకాలు
పాఠ్య పుస్తకాల పంపిణీలో విద్యాశాఖ ముందడుగు వేసింది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమై తరగుతులు మొదలయ్యాక వచ్చే పాఠ్య పుస్తకాలు...ఈ ఏడాది ముందుగా పాఠశాలలకు చేరాయి. ఆర్టీసీ రవాణాతో పాఠ్య పుస్తకాలను ఆయా పాఠశాలలకు చేర్చారు. బడులు తెరిచిన వెంటనే పుస్తకాలను విద్యార్థులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
దుస్తులు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థులకు పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు, బూట్లు అందజేయనున్నారు. కొన్నిచోట్ల వేసవి సెలవులకు ముందే ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. పంపిణీ పూర్తయిన పాఠశాలల విద్యార్థులు మొదటి రోజు నుంచే ఏకరూప దుస్తుల్లో వచ్చేందుకు వీలు కలిగింది. మరికొన్ని పాఠశాలలో ఇవాళ నుంచి దుస్తులు అందజేయనున్నారు.
మరమ్మత్తులు
విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అనుగుణంగా పాఠశాల భవనాలను సైతం అధికారులు తీర్చిదిద్దారు. భవనాల మరమ్మత్తులు చేయించటం, రంగులు వేయించే పనులు పూర్తి చేశారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో కొన్ని పాఠశాలలో నూతన భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం మంచి సౌకర్యాలు కల్పించటం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచి...మంచి ఫలితాలు రాబట్టే ప్రయత్నాలు చేసినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.
రాజన్న బడిబాట
విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే విధంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అందుకు తగిన విధానాలను అమలుచేయాలని చెప్పారు. ఎన్నికల హామీల్లో ఒకటైన అమ్మఒడి కార్యక్రమానికి ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమ్మఒడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపే తల్లులకు రూ.15 వేలు బహుమతిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నారు. వీటికి తోడు తాజాగా రాజన్న బడిబాట ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడమే రాజన్న బడిబాట ముఖ్య ఉద్దేశమని.....రాష్ట్ర వ్యాప్తంగా నాలుగురోజులపాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
నాలుగు రోజులపాటు జరగనున్న రాజన్న బడిబాట కార్యక్రమంలో తొలిరోజు విద్యార్థుల రాకకు స్వాగత సంబరం నిర్వహిస్తారు. విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించి, వారితో బొమ్ములు గీయించడం, వివిధ కళాకృతులను తయారుచేయిస్తారు. రెండో రోజు విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటిని దత్తత తీసుకోవడం, అభినయ గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తారు. ఇక మూడో రోజు పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామ పెద్దలు, ప్రజలను భాగస్వామ్యం చేస్తారు. చివరి రోజు వందనం అభినందనం ద్వారా ప్రముఖులతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇప్పిస్తారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉన్నందున...మొదటి వారం రోజులు మధ్యాహ్నం వరకే పాఠశాలలు పని చేయనున్నాయి.
ఇవీ చూడండి : రాజన్న బడి బాటతో పూర్వవైభవం: విద్యాశాఖ మంత్రి