అభ్యర్థుల జాబితాను కొలిక్కి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... జటిలమైన పెండింగ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలాంటి సుమారు 20 నుంచి 30 సీట్ల పంచాయితీ తేల్చే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. అక్కడి సమన్వయకర్తలు, నియోజకవర్గ నేతలతో చర్చించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయనున్నారు.
16వ తేదీ నుంచి ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తానని ప్రకటించిన సీఎం చంద్రబాబు... ఆదిశగానే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసే పనిని వేగవంతం చేశారు. వివిధ సమీకరణలు, పోటీతో జటిలమైన స్థానాల్లో అభ్యర్థుల విషయాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి నియోజకవర్గాల నేతలతో నేడు సమావేశం కానున్నారు.
సంక్లిష్టమైన జాబితాలో ఉన్న చిత్తూరు జిల్లా సత్యవేడు, శ్రీకాళహస్తి, మదనపల్లి, తంబాలపల్లి నేతలతో సీఎం చంద్రబాబు సమావేశంకానున్నారు. సొంత జిల్లా కావడంతో ప్రత్యేక శ్రద్ధపెట్టిన కావడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు చంద్రబాబు. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తలారి ఆదిత్య ఉండగా... సత్యవేడు టికెట్‌ను జేడీ రాజశేఖర్ ఆశిస్తున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు సుజనా, యనమల కమిటీ రంగప్రవేశం చేసి సత్యవేడు నేతల అభిప్రాయం తెలుసుకొని అధినేతకు నివేదించారు. శ్రీకాళహస్తి టికెట్ కోసం ఎస్సీవీ నాయుడు, బొజ్జల సుధీర్ పోటీ పడుతున్నారు. మదనపల్లి, లేదా తంబాలపల్లిలో ఒకటి బీసీకి ఇచ్చే యోచనలో పార్టీ ఉంది.
కృష్ణా జిల్లా కైకలూరు, నూజివీడు, తిరువూరులపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. తిరువూరుకు ఇంచార్జ్‌గా స్వామిదాస్ ఉన్నారు. ఈ స్థానానికి మంత్రి జవహర్ పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై సాయంత్రానికి స్పష్టత రానుంది. కైకలూరు టికెట్ జయమంగల వెంకట రమణ, దోనెపూడి పవన్ ఇద్దరూ ఆశిస్తున్నారు. ఇద్దర్నీ పిలిచి మాట్లాడి బలమైన వ్యక్తిని ఎంపిక చేయనున్నారు.
బాపట్ల అసెంబ్లీ పంచాయితీపైనా నేడు చర్చ జరగనుంది. బాపట్ల ఇంచార్జ్‌గా అన్నం సతీష్ ఉంటే... తన కుమారుడికి ఇవ్వాలని గాదె వెంకట్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇదే ఇక్కడ సమస్యగా మారింది. దీనిపైనా చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.