రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం వివాదం మళ్లీ రాజుకుంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి రఫేల్ ఒప్పందం ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. చౌకీదార్ చోర్ హై అని ధ్వజమెత్తారు. ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపిందని ఆరోపించారు.
మరోవైపు రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని మాజీ భారత రక్షణ కార్యదర్శి జి.మోహన్‌కుమార్ ఆరోపించారు.
రఫేల్ వివాదంపై తాజాగా రాహుల్ గాంధీ మోదీని, కేంద్రాన్ని విమర్శించిన కాసేపటికే మోహన్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుందని, రక్షణ శాఖను సంప్రదించకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారాయన.
భారత సార్వభౌమధికారంపై ఫ్రాన్స్ నుంచి లేఖ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తీసుకోలేదని భారత మాజీ రక్షణ కార్యదర్శి జి. మోహన్ కుమార్ ఆరోపించారు. యుద్ధ విమానాల ఒప్పందాల ఖర్చు గురించి ప్రధాని కార్యాలయం చూసుకుంటే అభ్యంతరం లేదు కానీ.. మిగిలిన విషయాల పట్ల రక్షణశాఖ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందన్నారు మోహన్. 2015 నుంచి 2017 వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు మోహన్ కుమార్.
రక్షణ అధికారుల అభ్యంతరాలపై అప్పట్లో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వివరణ లేఖ రాసారు. ఈ సమాంతర చర్చలు ప్రధాని కార్యాలయ జాయింట్ సెక్రటరీ జావేద్ అష్రాఫ్, ఫ్రాన్స్ దౌత్యాధికారి లూయిస్ వాసీ మధ్య 2015 అక్టోబర్ 20న జరిగినట్లు తెలిపారు.
ప్రభుత్వానికి కాస్త ఊరట
ఫ్రాన్స్ మాజీ ప్రధాని మానుయేల్ వాల్స్ 2016 సెప్టెంబర్ 8న భారత ప్రధానికి రాసిన లేఖ శుక్రవారం బయటపడింది. భారత సార్వభౌమాధికారంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మాజీ ప్రధాని లేఖ ప్రాధాన్యం సంతరించుకొంది. భారత్‌లో రఫేల్‌పై ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు ఇరు పక్షాల సమ్మతితోనే జరిగాయని ప్రధాని మోదీకి లేఖ రాసారు వాల్స్.