జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఘటన 2001లో జరిగిన ఉగ్రదాడిని తలపిస్తోంది. అప్పుడు కశ్మీర్ శాసనసభ వద్ద ఆత్మాహుతి దాడి జరిపిన ముష్కరులు ఇప్పుడూ దాదాపు అదే పునరావృతం చేశారు.
రెండుసార్లు దాడికి పాల్పడింది జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థనే. కానీ అప్పుడు ఆత్మాహుతి దాడి జరిపింది పాకిస్థాన్ వ్యక్తి కాగా, పుల్వామా ఘటనలో బాంబర్ భారత పౌరుడు కావటం గమనించాల్సిన అంశం.
ఈ దాడి అనంతరం కేంద్రప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి.
- 2016, సెప్టెంబర్ 29 మాదిరి మెరుపు దాడులు నిర్వహించడం
- దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవటం
ప్రస్తుతం పాక్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా దౌత్య పరమైన చర్చలు ఫలించే అవకాశం కన్పించట్లేదు. ఇలా కాని పక్షంలో మరోసారి మెరుపు దాడులకు అవకాశముందేమో చూడాలి.
దౌత్యపరమైన చర్చల్లో భారత్కు కొన్ని దేశాల మద్దతున్నా, ఐరాసలో చైనాకున్న వీటో అధికారంతో ఏమవుతుందో చూడాలి. చైనా పాక్కు ప్రియమైన మిత్రదేశం. ఈ నేపథ్యంలో భారత్ లక్షిత దాడులవైపే మొగ్గుచూపుతుందో చూడాలి.
2016, సెప్టెంబర్ 29న ఉరీ వద్ద మెరుపుదాడులు నిర్వహించి పాక్ ఉగ్రచర్యకు గట్టి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఈ ఘటనపై ప్రశంసలకు తోడు, విమర్శల్నీ ఎదుర్కొంది మోదీ ప్రభుత్వం. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.