అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర ప్రారంభమైంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్, కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జి ఉమెన్ చాందీలు బస్సు యాత్రను ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో 9 జిల్లాల మీదుగా శ్రీకాకుళానికి మార్చి 3న చేరనుంది.
బస్సు యాత్రకు ముందే ఉమెన్ చాందీ ఆధ్వర్యంలో ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో తొలి విడతగా అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై రఘువీరారెడ్డి, ఉమెన్ చాందీ, పల్లంరాజు, కేవీపీ రామచంద్రారావు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఉమెన్ చాందీ చెప్పారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ విభజన హామీల్లో భాగంగా ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వడంలో భాజపా బాధ్యత నుంచి తప్పుకుందని.. ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.