తెలంగాణలో అరాచకాలు సృష్టించే... కేసీఆర్ అధికారంలోకి వచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. అవే అరాచకాలు ఇక్కడా ప్రయోగిద్దామనుకుంటున్నారని తెలిపారు. పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంతమందిని బదిలీ చేస్తారో చేసుకోనివ్వండని అన్నారు. పోరాటమే ఊపిరిగా వచ్చిన పార్టీ తెలుగుదేశమని...తమకు పిరికితనం లేదని తేల్చిచెప్పారు.ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగానే తమ పోరాటం ఉంటుందన్నారు. ధర్మాన్ని ఇప్పుడు కాపాడుకుంటే భావితరాలకు అది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.ఆ స్ఫూర్తితో పోరాటానికి ప్రతిఒక్కరూ సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కొందామని నేతలకు దిశానిర్దేశం చేశారు.
తెరాస దర్శకత్వంలో జగన్ ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. వాళ్లు అరాచకం సృష్టిస్తుంటే అధికారులు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారని అన్నారు. అరాచకం సృష్టిస్తూనే అధికారులనూ బదిలీ చేయించే స్థాయికి వచ్చారని ధ్వజమెత్తారు. అరాచకమే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఏకపక్షంగా తమపై ఉపయోగించాలనుకుంటే ఒప్పుకోమని తెలిపారు. వాళ్ల అరాచకాలను గట్టిగానే పోరాడదాం అంటూ పార్టీ నేతలకు హితవుపలికారు.వ్యవస్థలన్నీ నాశనం చేసి తమపై పడదామని మోదీ చూస్తుంటే గట్టిగా బదులిద్దామని సీఎం పిలుపునిచ్చారు.