వైకాపా మేనిఫెస్టోలోని హామీలన్నీ అమలుచేసేలా ఒత్తిడి తెస్తామని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు వ్యవస్థ అంతా లోపాలమయంగా ఉండేదని.. తెలుగుదేశం పాలనలోని ఒకట్రెండు లోపాలను భూతద్దంలో చూపి వ్యతిరేకతగా చెప్తున్నారని వ్యాఖ్యానించారు. ఉండవల్లి నివాసంలో తనకు ఎమ్మెల్యే ధ్రువపత్రాన్ని అందించిన కుప్పం తెదేపా నాయకులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆధిక్యత తగ్గినందుకు క్షమించాలని నేతలు కోరగా.. అందులో తప్పేమీ లేదంటూ అధినేత వారికి సర్దిచెప్పారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం తాను కుప్పంలో పర్యటించి పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తానని చెప్పారు. చిన్న చిన్న లోపాలు సవరించుకోవాలని నేతలకు సూచించిన చంద్రబాబు.. అధికారం ఉన్నప్పుడు అసూయ ఉంటుందని.. దాన్ని పక్కన పెట్టి వాస్తవంలో ఉండాలని నేతలకు చురకలంటించారు. తెలుగుదేశానికి పలాయనం అనే మాటే తెలియదని.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిద్దామని వారిలో ఉత్సాహం నింపారు. రాష్ట్రం పట్ల అందరికి బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.