''ఏంటి విషయం...? ఎలా ఉంది.. మీ దగ్గర..? ఎవరొస్తున్నారంట..? మళ్లీ ఆయనేనా.. జగనా..? జనసేన సంగతేంది...?'' రెండు రోజులుగా ఎవరు ఫోన్ తీసినా.. ఏ ఇద్దరు ఎదురు పడినా ఇదే మేటర్.. ! ఎవరు గెలుస్తున్నారు... ఎవరొస్తున్నారు.. రాష్ట్రమంతటా ఇదే చర్చ. ఎన్నికలైపోయాయి కానీ.. ఎలక్షన్ ఫీవర్ మాత్రం తగ్గడం లేదు. ఎవరొస్తున్నారు..ఎన్నిగెలుస్తున్నారు... అక్కడలా... అంటగా.. ఇక్కడ ఇలా అంట.. అంటూ.. ఒకటే గోలగోల..! ఫలితాలు వచ్చే ఇంకో నలభై రోజుల పాటు..ఇదే పరిస్థితి.. !
వార్ వన్ సైడేనా..?
వార్ వన్ సైడ్ అయిపోయిందంటకదా.. లేడీస్ ఓట్లు అన్నీ.. అటే పడ్డాయంటగా.. అని క్వశ్చనూ..
లేదు లేదు.. ఈసారి వీళ్లు బాగా పికప్ చేశారు.. అలా ఏముండదు.. ఇటు నుంచి ఆన్సర్..!
ప్చ్.. అలాక్కాదంట.. మీరు చెప్పినంత లేదంటున్నారు.. ఇటు నుంచి ఇన్ఫర్మేషను....
అది మా ఏరియానే కదా.. నాకు తెలుసుకదా.. అటు నుంచి కన్ఫర్మేషనూ.. !
ఎక్కడ చూసినా.. ఇప్పుడిదే పరిస్థితి.. !
కాకా హోటల్లో "చాయ్ పే చర్చలు" నడుస్తున్నాయి. పొద్దున్నే వాకింగుల్లో వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి... ఆఫీసుల్లో అనాలసిస్సులు జరుగుతున్నాయి...ఫోన్లలో 'ఆరా'లు మొదలవుతున్నాయి. మీ పార్టీ స్కోరెంత..? మా వాడు గెలుస్తున్నాడా.. లేదా.. ? అక్కడ వాళ్లు ఎటేశారు.. ? ఓటింగ్ పెరగడం ఎవరికి లాభం... ?
ఈవీఎంలు మానేజ్ చేశారా.. ? ఎక్కడ చూసినా.. ఎలక్షన్ల గురించే మాటలు. ఇరవై రోజులుగా.. ఎవరు ఏ పార్టీ ఎలా ఉందనే చర్చలు.. పోలింగ్ పూర్తయ్యాక... వచ్చేదెవరనే విశ్లేషణలు.. ఎన్నికల వేళ సామాన్యులంతా.. 'సర్వే'యర్లు అయిపోతున్నారు. విశ్లేషణలు చేసేస్తున్నారు. బంగార్రాజులు బెట్టింగులు కాసేస్తున్నారు. రాష్ట్ట్రం మొత్తం ఓటింగ్ ఎలా జరిగిందనే దగ్గర నుంచి తమ ఊరిలో వార్డుల్లో ఎవరు.. ఎవరికి వేశారు అనే వరకూ ఈ చర్చలు నడుస్తున్నాయి. ఇందులో కొన్ని ముఖ్య నియోజకవర్గాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
(ఈ చర్చలు ఇలా నడుస్తున్నాయి.. )
వైజాగులో ఎవరంట...?
వైజాగులో.. జేడీ గారు గెలుస్తారంటావా... లేక మూర్తిగారి మనవడేనా..?
అబ్బే కష్టం.. అక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్.. పోయినసారి వైజాగ్ కింద ఉన్న ఏడు అసెంబ్లీలు వాళ్లే గెలిచారు.... అంత ఈజీ కాదు..
చదువుకున్నోళ్లు ఎక్కువున్నారు కదా.. వేసుండరా.. పైగా పవన్ కల్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు కదా.. ?
మ్మ్.. క్రాస్ ఓటింగ్ జరిగితే చాన్స్ ఉంది. కానీ.. మూర్తి గారి మనవడు కూడా గట్టిగానే తిరిగాడు..
వీళ్లిద్దరి ఓట్లు చీలిపోయి.. వైసీపీ గెలిచేస్తదంటావా..?
ఏమో చెప్పలేం.. అక్కడ ఇంకో ముఖ్యమైన కాండిడేట్ .. పురందేశ్వరి కూడా ఉన్నారుగా..
గాజువాక ఎట్టుంది..?
పవన్ పరిస్థితేంటి.. ? రెండు చోట్ల గెలుస్తాడా.. లేక.. ?
ఏమో బాగానే ఉందంటున్నారు. .అన్ని రకాలుగా చూసుకునే దిగుతాడుగా..
మిగతా ఇద్దరు కూడా గట్టోళ్లే కదా..
గట్టోళ్లే కానీ.. ఈయనకు కమ్యూనిస్టుల మద్దతు కూడా ఉందిగా.. ఫ్యాక్టరీలు అన్నింటిలో వాళ్లు చాలా మంది ఉన్నారు.
ఒకవేళ గెలిచే అన్ని ఓట్లు రాకపోతే..చీల్చే ఓట్లతో ఎవరికి నష్టం అంటావ్.. ?
ఏమో.. చెప్పడం కష్టమే... కానీ గెలుస్తాడనుకుంటాలే..! భీమవరంలో ఎట్లుందో.. రెండూ గెలుస్తాడా.. వాళ్లన్న లాగా.. అవుద్దో..?
జమ్మలమడుగు వచ్చినట్లేనా...?
ఇంకా.. జమ్మల మడుగు పరిస్థితేంటి.. వీళ్లకు వచ్చినట్లేనా.. ?
ఇద్దరూ కలిశారుగా.. రాకుండా పోతుందా..?
అంటే.. పైపైనేనా.. నిజంగానే కలుస్తారా..?
కలవకుండా ఏం చేస్తారు. ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాల్సిందేగా.. పెద్దాయన అన్నీ చూసే పెట్టేశాడు.. పోలింగ్ పర్సెంటేజీ కూడా పెరిగిందంటగా.. వాళ్లకే వచ్చుంటదిలే..!?
మరి గుడివాడ.. .?
గుడివాడ సంగతేంటి గురూ.. !?
అబ్బో అదెందుకడుగుతావ్ లే.. ఏం చెప్పలేకపోతున్నాం..
కాదే.. కుర్రోడు కొట్టేశాడంటున్నారు..
అంత ఈజీ కాదబ్బా.. అతను లోకలు కదా.. పైగా.. మాస్ ఫాలోయింగు
వీళ్లు కూడా గట్టిగానే ట్రై చేశారుగా.. మొత్తం లీడర్లంతా.. ఆ కుర్రోడికి సపోర్టు చేశారనుకుంటా..
ఏమో అది ఇప్పుడే చెప్పలేం.. చాలా టైట్ గా జరిగింది.
వాళ్లిద్దరూ..?
వాళ్లిద్దరి పరిస్థితేంటి...?
వాళ్లిద్దరెవరు... ?
లీడర్లిద్దరూ..
అక్కడేముంటుంది.. వాళ్లే గెలుస్తారుగా..
గెలుస్తారులే.. మెజార్టీలు మారతాయి.. తగ్గిస్తామని ఇద్దరూ చెబుతున్నారు..?
ట్రై చేస్తున్నారు.. టీడీపీ వాళ్లు గట్టిగానే ట్రై చేశారు.. చూడాలి మరి ఏమవుతుందో
ఈ రిజల్ట్ ఏమో కానీ... ఇంకా 40రోజులు చూడాలా..? ఈలోగా.. ఒక్కోళ్లకు బీపీ వచ్చేలాగా.. ఉంది.
అవును.. !