Guntur Court on Rishiteshwari Case : ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టేస్తూ గుంటూరు జిల్లా పోక్సో కోర్టు ఇంఛార్జ్ న్యాయమూర్తి కె.నీలిమ శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రిషితేశ్వరి 2014లో పెదకాకాని మండలం నంబూరులోని ఏఎన్‌యూలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరంలో చేరింది. అక్కడే మహిళా వసతిగృహంలో ఉండేది.
బీఆర్క్ నాలుగో సంవత్సర విద్యార్థులు నరాల శ్రీనివాస్ (పూర్వపు తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేట), దారావత్ జైచరణ్ నాయక్ (బూర్గంపాడు మండలం అంజనాపురం) రిషితేశ్వరిని ప్రేమిస్తున్నామంటూ వెంటపడ్డారు. వీరికి రెండో సంవత్సర విద్యార్థిని దుంప అనీష నాగసాయిలక్ష్మి (బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాల) సహకరించింది. రిషితేశ్వరి వారి ప్రేమను నిరాకరించింది. అయినా వారు వెంటపడి వేధించారు.
ఫ్రెషర్స్ డే వేడుకల్లో : ఫ్రెషర్స్ డే వేడుకలను హాయ్‌లాండ్‌లో 2015 మే 18న నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీనివాస్, జైచరణ్‌నాయక్ రిషితేశ్వరి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.ఆమె ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆయన పట్టించుకోలేదు. ఆ రోజు ఆయన మద్యం తాగి వేడుకల్లో పాల్గొన్నారు. సీనియర్ల వేధింపులు ఆగకపోవడంతో రిషితేశ్వరి మనోవ్యథకు గురైంది. ఈ విషయాన్ని డైరీలో రాసుకుంది. చివరకు 2015 జులై 14న హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ఘటనకు ప్రిన్సిపల్ బాబూరావు, విద్యార్థులు సాయిలక్ష్మి, శ్రీనివాస్, జైచరణ్నాయక్లను బాధ్యులుగా చేస్తూ రిషితేశ్వరి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెదకాకాని పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయలేకపోయిందని న్యాయమూర్తి నీలిమ తెలిపారు. ర్యాగింగ్‌తో పాటు ఇతర నేరాలకు ఆధారాలు చూపలేదని చెబుతూ నిందితులపై ఉన్న కేసును కొట్టివేస్తూ ఆమె తీర్పు వెలువరించారు. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు బీరం సాయిబాబు, గరికపాటి కృష్ణారావు, యు.మహతీశంకర్, జి.జోసఫ్‌కుమార్, సాయిమోహన్ వాదనలు వినిపించారు.
రాజకీయ దుమారం రేపిన ఘటన : రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో కొన్ని రోజులపాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) కేంద్రంగా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల ఆందోళనలు మిన్నంటాయి. అప్పటి పాలకపక్షం టీడీపీని బదనాం చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించారు. మరోవైపు ఈ ఘటనతో ప్రిన్సిపల్ బాబూరావుకు సంబంధం లేదని ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఆయనకు మద్దతుగా నిలిచారు. దాంతో వైఎస్సార్సీపీ నాయకులు రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేరుగు నాగార్జున, ముస్తఫా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు యూనివర్సిటీ గేట్లను నెట్టేసి, భద్రతాసిబ్బందిని దౌర్జన్యంగా గెంటేసి వీసీ, రిజిస్ట్రార్ ఛాంబర్లలోకి దూసుకొచ్చి నానా రభస సృష్టించారు. ఇంఛార్జ్ వీసీ కేఆర్‌ఎస్ సాంబశివరావు, ప్రిన్సిపల్ బాబూరావులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. దీంతో బాబూరావు తన పదవినుంచి వైదొలిగారు. ఇంఛార్జ్ వీసీ సాంబశివరావును నాటి ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది.
నాడు వైఎస్సార్సీపీ రాజకీయం : రిషితేశ్వరి ఆత్మహత్యను రాజకీయంగా వాడుకునేందుకు అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రయత్నించిందని నిందితుల తరఫు న్యాయవాది మహతీశంకర్ మీడియాకు తెలిపారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు, అప్పటి టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆయన చెప్పారు. మరోవైపు న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ నిరాశే ఎదురైందని రిషితేశ్వరి తల్లి దుర్గాబాయి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పోరాడే ఓపిక లేదన్నారు. దీనిపై హైకోర్టుకు అప్పీలు చేయాలా, వద్దా అన్నది తర్వాత ఆలోచిస్తామని వారు పేర్కొన్నారు.
పెళ్లైన కుమార్తె తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే - కారుణ్య నియామకానికి అర్హురాలే:హైకోర్టు
'మేం ప్రభుత్వాన్ని ఆదేశించలేం' - గీత కార్మికుల దుకాణాలపై హైకోర్టు తీర్పు - Liquor shops in ap