గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శ్రీ కార్తిక్ ఆసుపత్రిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రొద్భలంతో.. ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రమ్య ఆరోపించారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో కొందరు దుండగులు ముసుగులు వేసుకొని ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆసుపత్రి ఫర్నీచర్...ఇతర వస్తువులు ధ్వంసం చేశారు. నిఘా కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అవుతున్నాయని గమనించి వాటిని పగులగొట్టారు. రమ్య తండ్రి శ్రీమన్నారాయణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లో ఓడిపోయారు. వాటికి సంబంధిత లావాదేవీల కారణంగానే ఈ దాడి జరిగిందని ఆసుపత్రి నిర్వాహకులు అంటున్నారు.
బెట్టింగ్ వ్యవహరంపై నరసరావుపేట 1వ పట్టణ పోలీసు స్టేషన్లో పంచాయతీ జరిగిందని శ్రీమన్నారాయణ కుమార్తె రమ్య తెలిపారు. డబ్బులు లేవని చెప్పటం వలనే ఆసుపత్రిపై దాడి చేశారంటున్నారు. ఈ దాడిలో రమ్య భర్త డాక్టర్ అశ్వనీకాంత్ గాయపడ్డారు. ఆసుపత్రిపై అగంతకులు ఒక్కసారిగా దాడి చేయడం వలన రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే అండతోనే ఈ దాడి జరిగిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. దుండగులు ఆసుపత్రిలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఇదీ చదవండి : 'టిక్‌టాక్' చేస్తూ వెన్ను విరగ్గొట్టుకొన్న యువకుడు