రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని(sajjala comments on power crisis news) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వ విజ్ఞాపన మేరకు గృహ వినియోగదారులు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. లేకపోతే వచ్చే వేసవికి పరిస్థితి ఘోరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైతే అధికారిక విద్యుత్ కోతలు లేనప్పటికీ పరిస్థితి ఇలాగే కొనసాగితే కోతలు విధించాల్సి వస్తుందని తెలిపారు. సజ్జల సోమవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. విద్యుత్ సంక్షోభం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ పైనే చర్చ ఉంది. అంతర్జాతీయంగా కూడా ఎప్పుడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో బొగ్గు దొరకడం లేదు. పరిస్థితిని ప్రధానికి తెలిపేందుకే ముఖ్యమంత్రి జగన్ లేఖ(cm jagan letter to pm modi news) రాశారు.
బొగ్గు సరఫరా విషయంలో రాష్ట్రాలపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బొగ్గు నిల్వలు కేంద్ర పరిధిలోనివి. రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు’ అని వ్యాఖ్యానించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో భాజపా నేతల వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ.. ‘వారికి తెలిసిన ఏకైక విద్య మతం. ఏపీలో హిందువులకు ఏదో అన్యాయం జరుగుతోందని పాత పాటనే బద్వేలులో మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి జగన్‌పై అపోహలు సృష్టించాలని వారు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం ’అని అన్నారు.
తెదేపా కుట్రతోనే ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం
ఇళ్ల నిర్మాణాలపై కోర్టు ఉత్వర్వుల నేపథ్యంపై సజ్జల స్పందిస్తూ..‘పేదల ఇళ్లపై అడ్డగోలు కారణాలు చూపుతూ కోర్టులో వేసిన వ్యాజ్యాలతో తమకు సంబంధం లేదని పిటిషన్‌దార్లలో కొంతమంది బయటకు వస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించిన ఈ కుట్ర వెనుక తెదేపా, చంద్రబాబే ఉన్నారని నమ్ముతున్నాం. అప్పీలుకు వెళతాం. న్యాయమే గెలుస్తుంది. జాతీయ గృహ పథకం కంటే ఎక్కువ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. చంద్రబాబు హయాంలో 224 చదరపు అడుగుల్లో కడితే, ఇప్పుడు 340 చ.అడుగుల్లో ఇస్తున్నాం’ అని అన్నారు.
ఉద్యోగ సంఘాలను విడగొట్టడం లేదు
‘ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూనే ఉన్నాం కాబట్టే చక్రం తిరుగుతోంది. జగన్ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగానే ఉంటుందన్న విషయాన్ని ఏ సంఘం వారూ వ్యతిరేకించడం లేదు. మేం ఉద్యోగ సంఘాలను విడగొట్టడం లేదు. ఉద్యోగులంతా భాగస్వాములై పని చేస్తున్నందు వల్లే పథకాలు ప్రజలకు చేరుతున్నాయని ముఖ్యమంత్రి కూడా చెబుతూనే ఉన్నారు. కానీ, ఆర్థికంగా చాలా కారణాల వల్ల ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత జాప్యమవుతోంది. దాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులు అర్థం చేసుకుంటున్నారు కాబట్టే ప్రభుత్వానికి సహకరిస్తున్నారు’ అని సజ్జల తెలిపారు.
'ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘాతంలా మారింది. అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని తెదేపా అడ్డుకుంటోంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌కు వెళ్తాం.డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వానికి న్యాయం జరిగే అవకాశం ఉంది. జాతీయస్థాయి నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మిస్తున్నాం' - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు
ఇదీ చదవండి
CM Jagan: 2022 నుంచి హాజరుతో అమ్మఒడి పథకం అనుసంధానం: సీఎం జగన్