అమ్మఒడి స్ఫూర్తి కొనసాగాలి, పిల్లలంతా బడిబాట పట్టాలని ముఖ్యమంత్రి జగన్ (cm jagan news) అన్నారు. 2022 నుంచి అమ్మఒడి పథకం.. హాజరుకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే నిర్దేశించుకున్నామని.. ఈ ఏడాది ఈ నిబంధనను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాశాఖపై సమీక్షించిన సీఎం.. స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరుతో పాటు అమ్మఒడి, విద్యాకానుకపై చర్చించారు (CM Jagan review meeting on education department news). కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, హాజరుపై ఆరా తీశారు.
అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ కూడా పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలని నిర్దేశించారు. మ్యాపింగ్ చేసి.. ప్లే గ్రౌండ్ లేనిచోట భూసేకరణ చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
ఖర్చుల కింద రూ. లక్ష
పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలని సీఎం ఆదేశించారు. ప్రతి పాఠశాలకు నిర్వహణ ఖర్చుల కింద కనీసం 1 లక్ష రూపాయలను వారికి అందుబాటులో ఉంచాలన్నారు. మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందని, దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.
గందరగోళం ఉండొద్దు...
పాఠశాలల పనితీరుపై ర్యాంకింగ్‌లు ఇస్తామని, సోషల్ ఆడిట్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారుల ప్రతిపాదించారు. ఇలాంటి మార్పులు తీసుకు వచ్చినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అయోమయానికి, గందరగోళానికి దారితీసేలా నిర్ణయం ఉండకూడదని, దీనివల్ల అపోహలు పెరుగుతాయన్నారు. అపోహలను మరింత రెచ్చగొట్టి.. పక్కదోవ పట్టించే ప్రయత్నాలకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తీసుకురావాలనుకున్నా దాని వెనుకున్న ఉద్దేశ్యాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలన్నారు. ర్యాంకింగ్‌లు ఎందుకు ఇస్తున్నామో వారికి వివరించాలన్నారు. టీచర్లను తొలగించడానికో లేదా వారిని అభద్రతా భావానికి గురిచేయడానికో ఇలాంటి విధానాలు కావనే విషయాన్ని స్పష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. తప్పులు వెతకడానికి, ఆ తప్పులకు బాధ్యులను చేయడానికీ ఈ విధానాలు కావనే విషయాన్ని పదేపదే చెప్పాలన్నారు.
స్కూళ్లను నడిపే విషయంలో, విద్యార్థులకు బోధన, నాణ్యతను పాటించే విషయంలో ఎక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సోషల్ ఆడిటింగ్ ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. టీచర్ల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తిచేయాలని సీఎం సూచించారు. పాఠ్య ప్రణాళికను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలన్నారు. ఎయిడెడ్ స్కూళ్లను ఎవ్వరూ బలవంతం చేయడంలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్న సీఎం.. ఎయిడెడ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందని లేదా వాళ్లు నడపాలనుకుంటే వారే నడుపుకోవచ్చన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు.
'2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకుసాగాలి. ఏ మార్పులైనా ఉపాధ్యాయులతో మాట్లాడాలి. ఎయిడెడ్ స్కూళ్లను బలవంతం చేయట్లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. అప్పగింత అనేది స్వచ్ఛందం అన్న విషయాన్ని స్పష్టం చేయాలి. ఎయిడెడ్ యాజమాన్యాలు అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుంది' - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇదీ చదవండి
'పాముతో భార్యను చంపింది భర్తే'.. సూరజ్‌ను దోషిగా తేల్చిన కోర్టు