నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో మహిళలకు స్థానం(Female Entry in Nda) కల్పించాలని త్రివిధ దళాలు నిర్ణయం తీసుకున్నాయని సుప్రీంకోర్టుకు(Nda Supreme Court) కేంద్రం బుధవారం తెలిపింది. మహిళలకు శాశ్వత కమిషన్(Permanent Commission For Women In Army) ఏర్పాటు చేసేలా.. అర్మీ ఉన్నతాధికారులు సహా ప్రభుత్వ వర్గాలు చర్చించి, నిర్ణయం తీసుకున్నాయని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసననానికి అదనపు సొలిసిటరల్ జనరల్(ఏఎస్జీ) ఐశ్వర్య భాటీ వివరించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏఎస్జీ కోరారు. అదే విధంగా.. సంస్థాగత మార్పులు చేయాల్సి ఉన్నందున ఈ ఏడాది ఎన్‌డీఏ పరీక్షలను(Nda Exam 2021) యథావిధిగా నిర్వహించేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
"ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడు.. న్యాయస్థానం రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు మేం అడుగు పెట్టడం సంతోషకరమైన విషయం కాదు. ఈ నిర్ణయాన్ని మీరే స్వయంగా చేయాలని అనుకున్నాం. దేశంలోనే అత్యంత గౌరవనీయమైన బలగాలైనప్పటికీ.. లింగ సమానత్వం విషయంలో చాలా చేయాల్సి ఉంది. త్రివిధ దళాధిపతులు ఇప్పటికైనా ఈ తాజా నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. "
-సుప్రీంకోర్టు.
ఎన్‌డీఏ మహిళలకు అనుమతించాలని చాలా రోజులుగా తాము అనుకుంటున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఏఎస్జీ తెలిపారు. అయితే.. అది ఇంకా అంకుర దశలోనే ఉందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. అడ్వకేట్ కుష్ కార్లా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'ఎన్‌డీఏ పరీక్షకు మహిళలను అనుమతించాల్సిందే'