గర్భసంచి రెండు భాగాలుగా ఉన్న ఓ నిండు గర్భిణీకి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. మహిళకు ఆపరేషన్ నిర్వహించగా.. ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను బంగాల్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
ఇదీ జరిగింది..
నర్సింహపుర్ ప్రాంతానికి చెందిన అర్పిత మండల్.. పురిటి నొప్పులతో కోల్కతాలోని రాజర్హత్ ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెను వేరే ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో అర్పిత కుటుంబ సభ్యులు ఆమెను శాంతిపుర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి గైనకాలజిస్ట్ పబిత్రో బపారీ పర్యవేక్షించారు. అప్పుడు పబిత్రో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి అర్పితకు ఆపరేషన్ నిర్వహించగా.. పండంటి ఇద్దరు కవలలు జన్మించారు. ఈ క్రమంలో అర్పిత కుటుంబ సభ్యులు ఆనందంలో తేలిపోయారు. అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే శాంతిపుర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తారక్ బర్మన్.. గర్భిణీకి అరుదైన శస్త్రచికిత్స వైద్యులను అభినందించారు. పరిమిత వైద్య సామగ్రితో ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
"ప్రస్తుతం అర్పిత, ఆమె ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు సైతం ఆనందంగా ఉన్నారు. ఇదే ఆస్పత్రిలో అంతకుముందు ఇలాంటి శస్త్రచికిత్స నిర్వహించాం. ఇలా ఒకే మహిళలో రెండు భాగాలుగా గర్భసంచి ఉండడం అరుదైన సంఘటన. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటివి 17 కేసులు నమోదయ్యాయి. అందులో భారత్లోనే 3 ఉన్నాయి. వాటిలో బంగాల్లో 2 నమోదయ్యాయి. బృందంగా ఏర్పడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాం. ఆస్పత్రి సూపరిడెంట్ సహా పీడియాట్రిక్ విభాగం వైద్యులు నాకు సహకారం అందించారు. ఈ గౌరవం శాంతిపుర్ ఆస్పత్రిది మాత్రమే కాదు.. బంగాల్లోని వైద్యులందరిది.
--పబిత్రో బపారీ, వైద్యుడు