UP assembly polling: పంజాబ్ అసెంబ్లీలోని అన్ని స్థానాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి యూపీలో, 8 గంటల నుంచి పంజాబ్‌లో పోలింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
UP Punjab assembly election
యూపీలోని 16 జిల్లాల పరిధిలో ఉన్న 59 అసెంబ్లీ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 16 జిల్లాల్లో 8 జిల్లాలను యాదవ్ సామాజిక బెల్ట్‌గా పరిగణిస్తుంటారు. వాటిలో 29 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టు ఉంది. వీటిని నిలబెట్టుకోవాలని ఎస్పీ పరితపిస్తుండగా.. 2017 నాటి ఫలితాలను పునరావృతం చేయాలని భాజపా భావిస్తోంది.
UP third phase polling
మూడో దశ పోలింగ్ స్వరూపం...
- మొత్తం స్థానాలు- 59
- అభ్యర్థులు- 627 మంది
- ఓటర్లు- 2.15 కోట్లు
కీలక నేతలు
ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో నిలిచిన కర్హల్ స్థానానికి మూడో విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ సింగ్ పోటీ చేస్తున్న జశ్వంత్‌నగర్‌కు సైతం పోలింగ్ జరుగుతోంది.
గత ఎన్నికల్లో ఇలా...
2017లో ఈ 59 స్థానాల్లో ఎవరు ఎన్ని గెలిచారంటే?
- భాజపా- 49
- సమాజ్‌వాదీ పార్టీ- 9
- కాంగ్రెస్- 1
'గెలుపు మాదే'
ప్రభుత్వ వ్యతిరేకత, 3 సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం, యాదవ్ సామాజిక వర్గం సానుకూలత, ముస్లిం ఓటర్ల మద్దతుతో తాము మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఎస్పీ ఆత్మ విశ్వాసంతో ఉంది.
మరోవైపు, సంక్షేమ పథకాలు, డబుల్ ఇంజిన్ అభివృద్ధి వంటి అంశాలతో భాజపా ముందుకెళ్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభ.. శాంతి భద్రతలను అదుపు చేయడం, అయోధ్య, కాశీ క్షేత్రాల అభివృద్ధి వంటి పరిణామాలు కలిసి వస్తాయని.. కమలదళం అంచనా వేస్తోంది.
పంజాబ్ ఓటింగ్...
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలోని 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 93 మంది మహిళలు సహా 1,304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పంజాబ్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ఉన్నా శిరోమణి అకాలీదళ్ సహా భాజపా కూటమి కూడా అసెంబ్లీలో ఆధిక్యం దక్కించుకోవాలని ఆశిస్తున్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలకు పంజాబ్ కేంద్రంగా నిలిచింది. ఈ అంశం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్, ఆప్ రెండూ ధీమాగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ను అంతర్గత కలహాలు కలవరపెడుతున్నాయి. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నాయి. భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ సంయుక్త్ పార్టీలు ఉమ్మడిగా బరిలో ఉన్నాయి.
ఇదీ చదవండి: ఎన్నికల ప్రణాళికల అమలు బాధ్యత రాజకీయ పార్టీలదే!