స్కూల్‌కు వెళ్తున్న పదహారేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగింది. సెప్టెంబర్ 16న బాధిత బాలిక తన చెల్లితో కలిసి స్కూల్‌కు వెళ్తోంది. నిందితుడు ఇద్దరినీ కిడ్నాప్ చేశాడు. వారిని దిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడే బాలిక(16)పై అత్యాచారానికి తెగబడ్డాడు.
బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు బాలికలను గుర్తించారు. బాధితురాలి స్టేట్మెంట్ నమోదు చేసుకున్న అనంతరం.. నిందితుడిపై పోక్సో కేసును బనాయించారు. అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.
'ప్రేమ పేరుతో..'
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలన లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. లఖ్‌నవూ గ్రామీణం జిల్లా గోసాయిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేలియాగఢ్ ప్రాంతంలో 19ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడే తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని బాలిక తండ్రి ఆరోపించారు. ఇప్పుడు తన కూతురి మతాన్ని మారుస్తామని నిందితుడి కుటుంబం బెదిరిస్తోందని అన్నారు. తన కుమార్తె ఇంట్లో నుంచి రూ.లక్ష నగదు, బంగారం, వెండి నగలను తీసుకెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, బాలిక ప్రియుడితో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
'కుమార్తె ప్రాణానికి హాని'
మెహ్తాబ్ అనే వ్యక్తి తన కూతురిని మభ్యపెట్టి లవ్‌లోకి దించాడని యువతి తండ్రి ఆరోపించారు. 'తన తండ్రి, ముగ్గురు సోదరుల సాయంతో మెహ్తాబ్ నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు అతడి ఇంటికి వెళ్లా. అప్పుడు నిందితులు నన్ను చంపేస్తామని బెదిరించారు. నా కూతురికి మతమార్పిడి చేస్తామని అన్నారు' అని యువతి తండ్రి వాపోయారు. తన కూతురికి సైతం ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపారు.
11ఏళ్ల తర్వాత..
అయోధ్యలోనూ ఓ లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న ఓ వ్యక్తి.. తన భార్య ముస్లిం ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇస్లాంలోకి మారాలని తన భార్య హసీనా బానో, ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని వాపోయాడు. హిందువునని చెప్పి ఆమె తనను వివాహం చేసుకుందని చెప్పాడు. ఆస్తి మొత్తం హసీనా బానో పేరుమీద రాయాలని బెదిరిస్తున్నారని తెలిపాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితుడి భార్య, ఆమె కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు.
నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు..
బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తిని స్థానికులు కొట్టి చంపిన ఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని చందూర్ రైల్వే టౌన్లో జరిగింది. నవీన్ ఖాన్, అతడి స్నేహితులైన షేక్ అష్ఫక్, అతుల్ ఖుస్రం, మరో వ్యక్తి గరుడిపురలో ఉన్న ఓ ఇంట్లోకి బుధవారం చొరబడ్డారు. ఆ కుటుంబాన్ని కత్తులతో బెదిరించి.. బాలికను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దీనిపై స్థానికంగా ఆగ్రహావేశాలు మిన్నంటాయి. గురువారం రాత్రి బాలికను తిరిగి తీసుకొచ్చారు నిందితులు. బాలికను వదిలేసి పారిపోతుండగా.. నవీన్ ఖాన్‌ను స్థానికులు పట్టుకున్నారు. అతడిని చుట్టుముట్టి చావబాదారు. దీంతో అతడు చనిపోయాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
కిరాతక హత్య..
ఝార్ఖండ్ పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని నక్సల్ ప్రభావిత గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సుఖ్రాం ముండా అనే వ్యక్తిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. సుఖ్రాం సోమవారం నుంచి కనిపించకుండా పోయాడని పోలీసులు తెలివారు. మార్కెట్‌కు వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు. అతడిని తుపాకీతో కాల్చి చంపి.. ముఖాన్ని గుర్తుపట్టకుండా చేసేందుకు రాళ్లతో ఛిద్రం చేశారని తెలిపారు. గురువారం మృతదేహాన్ని గుర్తించినట్లు వివరించారు. నక్సల్ కోణంతో పాటు వ్యక్తిగత కక్ష్యలు కారణమై ఉంటాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.