Twin Towers Demolition : దిల్లీలోని ప్రతిష్టాత్మక కుతుబ్‌మినార్ కంటే ఎత్తుగా సూపర్‌టెక్ సంస్థ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో నిర్మించిన జంట భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ట్విన్ టవర్స్ పేకమేడల్లా కుప్పకూలాయి. ముంబయికి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్స్ కలిసి ఈ పని చేపట్టాయి. గతంలో తెలంగాణ సచివాలయం, సెంట్రల్ జైలును, గుజరాత్‌లో పాత మొతెరా స్టేడియంను ఈ సంస్థే కూల్చింది. అయితే ఈ కూల్చివేతకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆదివారం ఉదయమే అధికారులు పూర్తి చేశారు.
ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన గాలి..
సూపర్‌టెక్ ట్విన్ టవర్ల చుట్టూ గాలి దిశ తూర్పు వైపుకు మారిందని, దీని వల్ల ధూళి కణాలు దిల్లీకి బదులుగా గ్రేటర్ నోయిడా, బులంద్‌షహర్ వైపు మళ్లుతాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా పశ్చిమ దిశగా గాలి వీస్తున్నప్పటికీ ఒక్కసారిగా మార్పు వచ్చిందని ఉత్తర్‌ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు.
'నోయిడా అథారిటీ ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే'
నోయిడా డెవలప్‌మెంట్ అధికారులు ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే జంట భవనాలను నిర్మించామని, ఎలాంటి ఫిరాయింపులు జరగలేదని రియాల్టీ సంస్థ సూపర్‌టెక్ ఆదివారం తెలిపింది. ఈ రెండు టవర్ల కూల్చివేత తన ఇతర రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. గృహ కొనుగోలుదారులకు వడ్డీ కూడా చెల్లించి రీఫండ్ చేస్తామని చెప్పింది.
7 వేల మందిని పొద్దున్నే..
జంట భవనాల చుట్టుపక్క భవనాల్లో నివసిస్తున్న 7,000 మందిని ఆదివారం ఉదయం 7 గంటలకే అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు స్థానిక పోలీసు అధికారులు. దాదాపు 2,500 వాహనాల్ని ప్రత్యేక పార్కింగ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అలాగే దగ్గర్లోని నివాసాలకు వంట గ్యాస్, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వంట గ్యాస్, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించనున్నారు. పెంపుడు జంతువులు, వాహనాలను కూడా అక్కడి నుంచి తరలించారు.
వీధి కుక్కలను షెల్టర్‌లోకి..
ఆ ప్రాంతంలో తిరుగుతున్న 40 వీధికుక్కలను ఎన్‌జీఓలు నిర్వహిస్తున్న షెల్టర్‌లకు తాత్కాలికంగా తరలించారు. కూల్చివేత జరిగిన తర్వాత కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మెషిన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5:30 గంటల తర్వాత ప్రజలకు తమ నివాసాల్లోకి అనుమతిస్తారు.
500 మంది పోలీసులు మోహరింపు..
జంటభవనాలు కూల్చివేత సందర్భంగా 500 మందికి పైగా పోలీసులు చుట్టుపక్క ప్రాంతంలో మొహరించారు. ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అని జంక్షన్లలో ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని డీఎస్పీ తెలిపారు.
ట్రాఫిక్, డ్రోన్ల ఎగురవేతపై ఆంక్షలు..
కూల్చివేతకు 15 నిమిషాల ముందు దగ్గర్లోని గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై 450 మీటర్ల పరిధిలో ట్రాఫిక్ నిలిపివేశారు. కూల్చివేత పూర్తయ్యాక 15 నిమిషాల తర్వాత వాహన రాకపోకలను పునరుద్ధరిస్తారు. జంట భవనాల చుట్టూ ఒక నాటికల్ మైలు (1.8 కి.మీ.) మేర ఆదివారం విమానాలకు గగనతలం అందుబాటులో ఉండదని నోయిడా అథారిటీ తెలిపింది. నోయిడా పోలీసులు ఆగస్టు 26 నుంచి 31 వరకు నగరంలో డ్రోన్ల ఎగరవేతపై ఆంక్షలు విధించారు.
పక్క భవనాల్లో దుమ్ము చేరకుండా..
జంట భవనాలకు 8 - 12 మీటర్ల వ్యాసార్థంలో మరికొన్ని భవనాలు ఉన్నాయి. వాటిలోకి దుమ్ము చొరబడకుండా, వాటికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు జియో-టెక్స్‌టైల్ కవరింగ్ ఉపయోగిస్తున్నారు. సుమారు 225 టన్నుల ఇనుప మెష్, 110 కిలోమీటర్ల పొడవైన జియో-టెక్స్‌టైల్‌ను ఇందుకు వాడారు.
3700 కిలోల పేలుడు పదార్థాలు, 7000 రంధ్రాలు
ఈ జంట భవనాల కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. ఇందుకోసం భవనాల పిల్లర్లలో 7000 రంధ్రాలు చేశారు. 20,000 సర్క్యూట్లు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల నుంచి మీట నొక్కగానే భవనాలు నిలువుగా కుప్పకూలేలా రెడీ చేశారు. దీన్ని వాటర్‌ఫాల్ టెక్నిక్‌గా వ్యవహరిస్తున్నారు.
12 శాతం వడ్డీ చెల్లించి..
ఈ జంట భవనాల్లో ఒక్కో మూడు పడకల ఫ్లాట్ విలువ రూ.1.13 కోట్లు. రెండు భవనాల్లో కలిపి 915 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని అమ్మి ఉంటే ఆ సంస్థకు రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చేది. ఇక 915 ఫ్లాట్లలో 633 ఇప్పటికే బుక్ అయ్యాయి. అందుకోసం సంస్థ కొనుగోలుదార్ల నుంచి రూ.180 కోట్లు సేకరించింది. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని 12 శాతం వడ్డీ చెల్లించి రీఫండ్ చేయాల్సి ఉంది.
నిబంధనలను ఉల్లంఘించినందుకే..
నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించారు. దీనిపై దగ్గర్లోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్టు సొసైటీవాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించారు. దాదాపు 9 ఏళ్ల పాటు న్యాయపోరాటం కొనసాగించారు. తొలుత ఈ ప్రాంతంలో గార్డెన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వాదించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు నిర్మాణ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చింది. భవనాల్ని కూల్చివేయాలని 2014లో ఆదేశించింది. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. గత ఏడాది ఆగస్టులో అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. కూల్చివేతకు మూడు నెలల సమయం ఇచ్చింది. కానీ, సాంకేతికత కారణాల వల్ల ఏడాది సమయం పట్టింది.
ఇవీ చదవండి: చిన్నారి కళ్లు, నోట్లో ఫెవిక్విక్ పోసి చెరువులో పడేసిన ఉన్మాది, కుక్కపై అత్యాచారం