Train Accident in Jharkhand Today : ఝార్ఖండ్‌లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్ గేట్‌ను దాటుతున్న ఓ ట్రాక్టర్‌ను.. అదే సమయంలో వచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా ఢీ కొట్టింది. దూరం నుంచే ట్రాక్టర్‌ను గమనించిన లోకో పైలట్.. వెంటనే అప్రమత్తమై ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులను గట్టెక్కించారు. సడెన్ బ్రేకులు వేసి వేలమంది ప్రాణాలను కాపాడారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
బొకారో జిల్లాలోని భోజుడి స్టేషన్ సమీపంలో ఉన్న సంతాల్దియా రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వారు వివరించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. 5.27 గంటలకు పట్టాలపై నుంచి ట్రాక్టర్‌ను తొలగించినట్లు వెల్లడించారు.
ఘటన అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయాడని అధికారులు తెలిపారు. రైల్వేగేట్‌ను ఆలస్యంగా క్లోజ్ చేయడమే.. ప్రమాదానికి కారణమని వారు వెల్లడించారు. దీంతో గేట్‌మన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఘటనలో ఎవరికీ హాని జరగలేదన్న అధికారులు.. 45 నిమిషాల పాటు రైలు నిలిచిపోయిందని తెలిపారు.

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
మధ్యప్రదేశ్‌లోనూ ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జబల్పూర్ పరిధిలోని షహపూర్ భితౌనీ వద్ద LPG తీసుకుని వెళ్తున్న రైలు.. ఈ ప్రమాదానికి గురైంది. గూడ్సు రైలుకు చెందిన రెండు వ్యాగన్లు.. పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దిగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన గూడ్సు రైలు పట్టాలు తప్పిందని చెప్పిన పశ్చిమ మధ్య రైల్వే సీపీఆర్ఓ.. ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందిలేదన్నారు. పట్టాలు తప్పిన మార్గాన్ని సరిచేసేపనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

Train Accident Odisha : జూన్ 2న ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం.. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఆ ఘటన మరవక ముందే అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి. దీంతో రైల్వే ప్రయాణికులు కాస్త ఆందోళలకు గురవుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఒడిశాలోని బహానగా రైల్వే స్టేషన్లో లూప్ లైన్లో నిలిపి ఉంచిన గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలను ఢీకొట్టింది. ఘటనలో మొత్తం 288 మంది మృతి చెందారు. మరో 1,200 మందికిపైగా గాయపడ్డారు.