Mamata banerjee no UPA: కేంద్రంలో 2014కు ముందు రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఇప్పుడు మనుగడలో లేదని బంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని, దానిపై ఎవరూ పోరాడటం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో బలమైన ప్రత్యామ్నాయానికి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో జరిగిన భేటీ తర్వాత మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
"శరద్ పవార్ చాలా సీనియర్ నాయకుడు. రాజకీయ పార్టీల విషయమై మాట్లాడేందుకు నేను వచ్చా. శరద్ పవార్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నా. నియంతృత్వంపై ఎవరూ పోరాడటం లేదు కాబట్టి బలమైన ప్రత్యామ్నాయం అవసరం."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
అది కాంగ్రెస్‌కూ వర్తిస్తుంది: పవార్
భావసారూప్యత కలిగిన పార్టీలు జాతీయ స్థాయిలో సంయుక్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ పేర్కొన్నారు. మమతా బెనర్జీతో సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన.. ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాలని చెప్పారు. భాజపాకు వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీనైనా ముందుకొస్తే.. స్వాగతిస్తామని అన్నారు. అది కాంగ్రెస్ పార్టీకీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
"సంజయ్ రౌత్, ఆదిత్యా ఠాక్రే ఇదివరకే మమతా బెనర్జీని కలిశారు. ఈరోజు నేను, నా సహచరులు ఆమెతో సుదీర్ఘంగా చర్చలు జరిపాం. జాతీయ స్థాయిలో భావసారూప్యత కలిగిన పార్టీలు సంయుక్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది మమత ఆలోచన. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించాల్సిన బాధ్యత మాపై ఉంది. మేం ఆలోచించేది ఈ ఒక్కరోజు కోసం కాదు. రాబోయే ఎన్నికల కోసం. దానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది."
-శరద్ పవార్, ఎన్సీపీ చీఫ్
అంతకుముందు ముంబయి సివిల్ సొసైటీ సభ్యుల సమావేశంలో మాట్లాడిన దీదీ.. ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే.. భాజపాను ఓడించడం సులభమేనని వ్యాఖ్యానించారు.
అది కలే: కాంగ్రెస్
అయితే, కాంగ్రెస్ మాత్రం తాజా పరిణామాలపై పెదవి విరిచింది. దేశ రాజకీయాల వాస్తవితక ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. కాంగ్రెస్ లేకుండా భాజపాను ఓడించాలనుకోవడం కేవలం కలేనని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: