Manipur assembly election: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో గత ఐదేళ్లలో తీవ్రవాదం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని అధికార భాజపా గర్వంగా చెబుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ముష్కర సంస్థల సమన్వయ కమిటీ- 'కోర్‌కం' మంగళవారం పిలుపునిచ్చిన బంద్ విజయవంతమంది. దాదాపుగా రాష్ట్రమంతటా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలపై తీవ్రవాదుల ప్రభావం ఇంకా బలంగా ఉందని చెప్పేందుకు అది నిదర్శనం.
ప్రతి అభ్యర్థి వెనుక..
మణిపుర్‌లో క్రియాశీలకంగా ఉన్న ఆరు నిషేధిత ముష్కర సంస్థల కూటమి- కోర్‌కం. ఇందులోని భాగస్వామ్య సంస్థలు స్వతంత్ర మణిపుర్ సాధనే లక్ష్యంగా పోరాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ తీవ్రవాద సంస్థలు ప్రభావం చూపుతుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ప్రతి అభ్యర్థికీ ఏదో ఒక తీవ్రవాద సంస్థ అండ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక్కడ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల్లోని నాయకులు తీవ్రవాద సంస్థలతో సంబంధాలు నెరుపుతుంటారని మణిపుర్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. లోయ ప్రాంతాల్లో ఎవరికి ఓటు వేయాలో ఆదేశించి, తదనుగుణంగా గ్రామ పెద్దల నుంచి తీవ్రవాదులు హామీ పత్రాలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తోందని ఇంఫాల్‌లో సామాజిక కార్యకర్త ఒకరు పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజా ఎన్నికల్లోనూ తీవ్రవాదుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల వారు మెరుగుపర్చిన పేలుడు పదార్థం (ఐఈడీ)ని పేల్చగా ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ) సిబ్బంది గాయపడ్డారు. మరోవైపు- పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతూ.. తీవ్రవాద ముఠాల సభ్యులను అరెస్టు చేస్తున్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి: యూపీలో సంక్షేమ పథకాలపైనే భాజపా ఆశలు