Teacher Suspend: తమిళనాడు కన్యాకుమారి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను మతమార్పిడి చేయడానికి ప్రయత్నించింది. టైలరింగ్ (కుట్టుపని) క్లాస్లో విద్యార్థులను క్రైస్తవ పార్థనలు చదవమని బలవంతపెట్టింది. ఈ విషయంపై బాధిత విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదు అందుకున్న విద్యాశాఖ అధికారులు.. విచారణ జరిపి ఆమెను విధుల నుంచి తొలగించారు.
"ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించాం. అయితే సరిగ్గా ఏం జరిగిందనే దానిపై పూర్తి నివేదిక రావాల్సి ఉంది." అని తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు.
ఏం జరిగిందంటే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కన్నట్టువిలై ఉన్నత పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే స్కూల్లో పిల్లలకు టైలరింగ్ నేర్పించే ఓ ఉపాధ్యాయురాలు.. విద్యార్థుల మతమార్పిడికి ప్రయత్నించింది. క్రైస్తవ ప్రార్థనలను చదవమని ఒత్తిడి చేసింది. బాధిత హిందూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా ప్రధానోపాధ్యాయుడి ఎదుట ఓ విద్యార్థినిని పోలీసులు విచారిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదీ చదవండి: పెంపుడు కుక్క మొరిగిందని గొడవ.. యజమానిపై కాల్పులు