Gyanwapi Case Supreme Court: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే వ్యవహారంపై శుక్రవారం తాము విచారణ చేపట్టే వరకు దిగువ కోర్టు విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను కొనసాగించింది.
అయితే ఈ విచారణను శుక్రవారానికి లేదా మరో రోజుకు వాయిదా వేయాలని హిందూ సంఘం తరఫు న్యాయవాది కోరగా, గురువారమే కొనసాగించాలని మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజేఫా అహ్మదీ అభ్యర్ధించారు. దేశంలోని అనేక మసీదులను సీల్ చేయాలని వివిధ కోర్టులకు దరఖాస్తులు అందాయని, జ్ఞానవాపి మసీదులో కొలను చుట్టూ ఉన్న గోడను కూల్చివేయాలని కూడా దరఖాస్తు అందించారని మసీదు కమిటీ తరఫు న్యాయవాది వివరించారు. హిందూ భక్తులు సివిల్ కోర్టు ఆదేశాలు పాటించకుండా చూడాలని అభ్యర్ధించారు. హిందువులు సివిల్ కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోబోరని హిందూ భక్తుల తరపు న్యాయవాది హామీ ఇచ్చారు. ఇక, ఈ అంశంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరపనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.
Gyanvapi Shivling found: జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు ఇటీవలే పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో ఈ నెల 14నుంచి 16వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా.. మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించగా, ఆ ప్రదేశాన్ని సీల్ చేయాల్సిందిగా అధికారులను న్యాయమూర్తి సోమవారం ఆదేశించారు. అయితే, అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు. జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: రాజీవ్ హత్య కేసు.. పేరరివాళన్ అరెస్ట్ నుంచి విడుదల వరకు ఎన్నో మలుపులు