బలవంతపు మత మార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది 'చాలా తీవ్రమైన' అంశమని వ్యాఖ్యానించింది. ఈ మత మార్పిడులను నివారించేందుకు నిజాయితీ చర్యలు అవసరమని, ఈ విషయంలో కేంద్రం రంగంలోకి దిగాలని స్పష్టం చేసింది. బలవంతపు మత మార్పిడులను నివారించకపోతే 'అత్యంత తీవ్రమైన పరిస్థితులు' తలెత్తుతాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
కేంద్రానికి నోటీసులు..
భాగస్వాములను ఆకర్షణకు గురిచేసి, మత మార్పిడికి బలవంతం చేస్తున్న విధానాలపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం.. వీటి నివారణకు చర్యలు ప్రతిపాదించాలని సొలిసిటర్ జనరల్(ఎస్జీ) తుషార్ మెహతాను ఆదేశించింది.
"ఇది చాలా తీవ్రమైన విషయం. బలవంతపు మతమార్పిడులను ఆపేందుకు కేంద్రం నుంచి నిజాయితీతో కూడిన చర్యలు అవసరం. లేదంటే అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఏం చర్యలు తీసుకోవచ్చో చెప్పండి. మీరు(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎస్జీతో) రంగంలోకి దిగాలి. దేశ భద్రతతో పాటు మతస్వేచ్ఛ హక్కును ప్రభావితం చేసే తీవ్రమైన విషయం ఇది. కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉండాలి. బలవంతపు మత మార్పిడులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కౌంటర్ దాఖలు చేయండి."
-సుప్రీంకోర్టు
బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. బెదిరింపులు, మభ్యపెట్టడం సహా డబ్బు ఆశచూపి మోసపూరితంగా జరుగుతున్న మత మార్పిడులను అడ్డుకోవాలని కోర్టును కోరారు. ఈ మేరకు కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విన్నవించారు.