Justice MR Shah Retirement : "నేను రిటైర్ అయ్యే వ్యక్తిని కాను.. నా జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను" అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ముకేశ్‌కుమార్ రసిక్‌భాయ్ షా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.. కొత్త ఇన్నింగ్స్‌లో శక్తి, ధైర్యంతో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్ననట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో జస్టిస్ ఎంఆర్ షా.. చివరసారిగా ప్రసంగించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమంలో హిందీ ప్రముఖ పాట 'జీనా యహా.. మర్నా యహా'ను జస్టిస్ ఎంఆర్ షా.. గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేయడంలో తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
"నా హయాంలో ఎవరి మనోభావాలను కించపరిచినా బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నా పనిని ఎప్పుడూ ఆరాధనగానే భావించాను. మీరు చూపిన ప్రేమ, ఆప్యాయతలకు నేను పొంగిపోయాను. అందరికీ కృతజ్ఞతలు. నా సహాయక సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను"
-- జస్టిస్ ఎంఆర్ షా
జస్టిస్ ఎంఆర్ షా వీడ్కోలు కార్యక్రమంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు. "నేను అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా ఉన్నప్పుడు జస్టిస్ షాతో నాకు అనుబంధం ఏర్పడింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఆయన మళ్లీ నియమితులైనప్పుడు మా స్నేహాన్ని పునరుద్ధరించుకున్నాము. జస్టిస్ షా గురించి ఓ స్నేహితుడిగా సాయంత్రం మాట్లాడతాను" అని సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యనించారు. జస్టిస్ ఎంఆర్ షాతో కలిసి కూర్చుని అన్ని రకాల కేసులను బెంచ్‌లో పరిష్కరించడం ఆనందంగా ఉందని అని ఆయన తెలిపారు.
"ఆయన (జస్టిస్ ఎంఆర్ షా) ఎల్లప్పుడూ ఛాలెంజ్‌లకు సిద్ధంగా ఉంటారు. కొవిడ్ మహమ్మారి వల్ల మేము ఇళ్లల్లో ఉన్నప్పుడు కూడా సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ పనికి దూరంగా ఉండేవాడు కారు. ఆయనకు ఏదైనా తీర్పు పంపితే.. అతని సలహాలతో రాత్రికి రాత్రే తిరిగి మళ్లీ నా దగ్గరకు వస్తుంది. డ్రాఫ్ట్ కోసం ఆయనకు ఒక తీర్పును పంపితే.. 48 గంటల్లో నా టేబుల్‌పైకి వస్తుంది. జస్టిస్ ఎంఆర్ షా ఏదీ పెండింగ్‌లో ఉంచలేదు. కొలీజియంలో నాకు ఆయన నిజమైన స్నేహితుడు" సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
జస్టిస్ ముకేశ్‌కుమార్ రసిక్‌భాయ్ షా.. 1958 మే16న జన్మించారు. 1982 జులై 19న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కొన్ని రోజులు పాటు గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2004 మార్చి 7న గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2005 జూన్ 22న శాశ్వత న్యాయమూర్తిగా, 2018 ఆగస్టు 12న పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నవంబరు 2న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2023 మే 15న పదవీ విరమణ చెందారు. జస్టిస్ ఎంఆర్ షా.. రిటైర్ అవ్వడం వల్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు తగ్గింది.