Stomach Smuggling: వీడొక్కడే సినిమా చూశారా? అయితే.. డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి అర్థమయ్యే ఉంటుంది! డ్రగ్స్ సరఫరాలో భాగంగా హీరో ఫ్రెండ్ ఓ సారి డ్రగ్స్‌ను కడుపులోకి మింగి అక్రమ రవాణాకు పాల్పడతాడు.. గుర్తొచ్చిందా? సరిగ్గా అలాంటి ఘటనే దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
ఉగాండా నుంచి వస్తున్న ఓ మహిళ ఎయిర్ పోర్ట్‌లో ఆయాసపడుతూ నడుస్తోంది. ఇది గమనించిన అధికారులు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె నిరాకరించింది. అనుమానంతో కస్టమ్స్ అధికారులు ఆమెను చెక్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఒక కేజీ బరువున్న 91 కొకైన్ క్యాప్సుల్స్‌ను ఆమె కడుపులో గుర్తించారు. వాటి విలువ రూ.14 కోట్లు ఉంటుందని చెప్పారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. ఆ మహిళను అరెస్టు చేశారు.
సాధారణంగా ఈ విధమైన డ్రగ్స్ రవాణా చేసేవారు 400-500 గ్రాముల వరకు కడుపులో తీసుకొస్తారు. కానీ ఈ మహిళ ఏకంగా కేజీ కొకైన్‌ను ప్రమాదకర స్థాయిలో అక్రమ రవాణాకు పాల్పడిందని అధికారులు తెలిపారు.
సోప్ బాక్సుల్లో డ్రగ్స్..
Hiding Drugs In Soap: సోప్ బాక్సుల్లో అక్రమంగా డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న ముగ్గురు నైజీరియన్లను బెంగళూరు అధికారులు అరెస్టు చేశారు. రూ. 80 కోట్ల విలువైన కొకైన్, హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా నుంచి వ్యాపార వీసా మీద భారత్‌కు వచ్చి డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. డ్రగ్స్‌ను ముంబయి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళ లోదుస్తుల్లో బంగారం అక్రమ రవాణా..
Gold Smuggling By Hiding Under Garments: లోదుస్తుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ మహిళను జైపుర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి 700 గ్రాముల బరువున్న బంగారాన్ని నిందితురాలు లోదుస్తుల్లో పెట్టి అక్రమంగా తీసుకొస్తున్నారని తెలిపారు. దీని విలువ రూ.35 లక్షలు ఉంటుందని వెల్లడించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. మహిళను అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: కాన్పుర్‌లో మరో 'జీఎస్టీ' మోసం.. పక్కా ప్లాన్‌తో ఒకేసారి సోదాలు!