Supreme court Sedition case: దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్షన్ 124ఏ ప్రకారం కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం సోమవారం స్పష్టం చేసిన నేపథ్యంలో.. అప్పటివరకు కేసులు నిలిపివేత సాధ్యాసాధ్యాలపై ఆరా తీసింది. కేంద్రం తుది నిర్ణయం తీసుకునేలోపు పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. దేశద్రోహం చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా చూడాలని పేర్కొంది.
Supreme court sedition law PIL: అదేసమయంలో, దేశద్రోహం చట్టంపై పునఃపరిశీలన ప్రక్రియను 3-4 నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. దేశద్రోహం చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలని యోచిస్తోందనే విషయాన్ని వివరించాలని కోరింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి బుధవారం స్పందన సమర్పించనున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. కేంద్రం తరపున విచారణకు హాజరైన ఆయన.. కేసుల నమోదు తాత్కాలికంగా నిలిపివేయడంపై చర్చిస్తామని చెప్పారు. అనంతరం విచారణ బుధవారానికి వాయిదా పడింది.
Sedition case updates: రాజద్రోహం చట్టంపై పునరాలోచన చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం సోమవారం తెలియజేసింది. అంతకుముందు అఫిడవిట్లో చట్టాన్ని సమర్థించిన కేంద్రం.. అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఈ కేసులపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలో.. కేంద్రం తన స్పందన తెలియజేసింది. పునఃపరిశీలన ప్రక్రియ ముగిసేవరకు వ్యాజ్యాలపై విచారణ చేపట్టవద్దని అఫిడవిట్లో పేర్కొంది. 'వలసపాలకుల నాటి రాజద్రోహం చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలను విస్తృత ధర్మాసనానికి నివేదించాలా? లేదా?' అన్న అంశంపై ఈ నెల 10న వాదనలు వింటామని ఇటీవల వెల్లడించింది. దీనిపై గతవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఈ అంశంపై తన స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు బుధవారం నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చదవండి:
దిల్లీలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'.. అడ్డుకున్న ఎమ్మెల్యే అరెస్ట్