Road Accident in Annamayya District: రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీంతో రహదారులు నెత్తిరోడాయి. దేవాలయాలను దర్శించుకుని తిరిగివస్తుండగా ఒక ప్రమాదం చోటుచేసుకోగా.. మరొకటి ఆగి ఉన్న ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీ కొట్టడంతో జరిగింది. ఈ రెండు ప్రమాదాలలో తొమ్మిది మంది మరణించగా.. పలువురు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం మఠంపల్లి వద్ద తుఫాన్ వాహనం-లారీ ఢీకొనడంతో.. ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు కాగా.. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. వీరంతా తిరుమలకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు.
కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా అతుని తాలూకా బడచి గ్రామానికి చెందిన 16 మంది తిరుమల దర్శనం చేసుకుని గురువారం రాత్రి స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యలో శుక్రవారం ఉదయం 3.30 గంటల సమయంలో.. కడప -చిత్తూరు జాతీయ రహదారిలోని మఠంపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న తూఫాన్ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తూఫాన్ వాహనంలో 16 మంది ఉండగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తీర్థయాత్ర నిమిత్తం బయలుదేరిన వీరు మొదటగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తిరుమలకు వెళ్లి అక్కడ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో తల్లి కుమార్తెలు శోభ (36), అంబికా (14) తో పాటు మనంద (32), డ్రైవర్ హనుమంతు (42)ఉన్నారు. మృతదేహాలను పీలేరు ప్రభుత్వాసుపత్రికి.. 11 మంది క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరుపతిలోని రూయ ఆసుపత్రికి తరలించారు.
Car Accident Viral Video : అతివేగంతో వృద్ధుడిపైకి దూసుకెళ్లిన కారు.. లారీ కింద పడి యువ దంపతులు మృతి
Road Accident in Chittoor: చిత్తూరు - తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. రహదారిపై ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను అంబులెన్సు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకొంది. కిమ్స్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ వేలూరు నుంచి తిరుపతి వెళుతూ తవనంపల్లె మండలం తెల్లగుండ్లపల్లి వద్ద ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు ఒడిశా రాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.