ఇతరులను బలవంతంగా మతం మార్పించడమన్నది మతస్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. మోసం, బలప్రయోగం, ఆకర్షణల ద్వారా మతమార్పిళ్లకు పాల్పడితే మతస్వేచ్ఛను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. అలాంటి చర్యలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.
భయపెట్టడం, బహుమతులు అందజేయడం, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారా దేశంలో మతమార్పిళ్లు చోటుచేసుకుంటున్నాయని.. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలతో కోర్టులో సంక్షిప్తంగా ఓ ప్రమాణపత్రాన్ని సమర్పించింది. బలవంతపు మతమార్పిళ్ల సమస్య తీవ్రత గురించి తమకు తెలుసని అందులో పేర్కొంది. అశ్వినీకుమార్ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. మతస్వేచ్ఛను పరిరక్షించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.
ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. మతమార్పిళ్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అయితే బలవంతపు మతమార్పిళ్లు ఎంతమాత్రమూ సముచితమైనవి కావని పేర్కొంది. ఈ అంశంపై రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించి సమగ్ర ప్రమాణపత్రం సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.
మరోవైపు- ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, హరియాణా వంటి రాష్ట్రాలు బలవంతపు మతమార్పిళ్లను నిరోధించేందుకు ఇప్పటికే ప్రత్యేక చట్టాలను ఆమోదించాయని సర్వోన్నత న్యాయస్థానానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు.
ఈవీఎం పనిచేయట్లేదని తెలపడం నేరం..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) విషయంలో తప్పుడు ఫిర్యాదులు చేసే ఓటర్లకు దాని పర్యవసానాలేమిటో తప్పనిసరిగా తెలియాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలు, ఓటు రసీదు యంత్రాలు (వీవీప్యాట్‌లు) పనిచేయకపోవడం గురించి నివేదించడం నేరమన్నట్లు చెబుతున్న 'ఎన్నికల ప్రవర్తన నియమావళి'లోని 49ఎంఏ నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సునీల్ అహ్యా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
తాను ఒకరికి ఓటు వేస్తే వీవీప్యాట్‌లో వచ్చిన రసీదులో మాత్రం మరొకరికి పడినట్లు చూపించిందని ఓటరు ఫిర్యాదు చేస్తే ఆ మేరకు ప్రిసైడింగ్ అధికారి రాతపూర్వకంగా డిక్లరేషన్ తీసుకోవాలని ఈ నిబంధన చెబుతోంది. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అయితే పరిణామాలు ఎలా ఉంటాయో ముందుగా హెచ్చరించాలని దానిలో ఉంది. యంత్రాల్లో పొరపాటు చోటుచేసుకున్నా బాధ్యతను ఓటరుపై నెట్టడమంటే రాజ్యాంగబద్ధంగా లభించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో చొరబడడమేనని పిటిషనర్ ఆరోపించారు.
"(ఇలాంటి అంశాల్లో) తప్పుడు ఫిర్యాదు చేస్తే దానివల్ల తలెత్తబోయే పరిణామాలేమిటో తెలుసుకుని తీరాలి" అని ధర్మాసనం తెలిపింది. ఈసీ నిబంధన వల్ల ఈవీఎంలపై ఫిర్యాదులు చేయడానికీ ఎవరూ ముందుకు రారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఎన్నికల నిబంధన ఎలా ఇబ్బందికరం అవుతుందో, దానిని ఎందుకు రద్దు చేయాలో రాతపూర్వకంగా నివేదించాలని పిటిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.