Priyanka Gandhi Children: తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయినట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ పర్యటన గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు చేశారు. ఇటీవల ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించాలంటూ ప్రియాంకను అడగ్గా.. 'ఫోన్ ట్యాపింగ్ సంగతి వదిలేయండి. ప్రభుత్వం మా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేస్తోంది. వాళ్లకు వేరే పనిలేదా?' అని ప్రశ్నించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. మంగళవారం ప్రధాని పర్యటన మహిళా ఓటర్లను ఉద్దేశించి జరిగింది. ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే కొన్ని కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. 'ఈ రోజు ప్రధాని మహిళా శక్తి ముందు తలవొంచారు. మహిళలు తమ శక్తిని గుర్తించాలని నేను ఇదివరకే అన్నాను. అందుకే ప్రభుత్వం మీ ముందు తలవొంచి కొత్త పథకాలు ప్రవేశపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడు వాటిని తీసుకువస్తోంది' అంటూ విమర్శలు చేశారు.
ఇదిలాఉండగా.. 'మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. మా సంభాషణలు రికార్డు చేస్తున్నారు. మా పార్టీ ఆఫీస్ ఫోన్ల సంభాషణలు వింటున్నారు. సాయంత్రం పూట సీఎం కూడా మా సంభాషణలు వింటున్నారు' అంటూ ఇటీవల అఖిలేశ్ ఆరోపించారు. ఈ విమర్శలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు. అఖిలేశ్ అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేసి ఉండొచ్చని, అందుకే ఇప్పుడాయన ఇతరులను నిందిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: