సినీ ఫక్కీలో ఓ యువకుడిని కాపాడారు పోలీసులు. మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన యువకుడిని 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సినిమాలో లాగా ఛేజ్ చేసి రక్షించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది.
అసలేం జరిగిందంటే.. తౌహీద్ అనే యువకుడు మల్దివాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం ఆ యవకుడ్ని కొందరు దుండగులు బందేపల్యా పోలీస్ స్టేషన్ పరిథిలో కిడ్నాప్ చేశారు. అనంతరం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి బంధించారు. ఆ తర్వాత తౌహీద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. రూ. 60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే తాము తౌహీద్‌ను చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడిని అతడి తల్లి.. రూ.35 వేలు కిడ్నాపర్లకు ఇచ్చింది. అయినా ఆ దుండగులు తౌహీద్‌ను విడిచిపెట్టలేదు. ఇలా లాభం లేదు అనుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు.. రాత్రి మల్దివాలా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. కోరమంగళ చెక్‌పోస్టు వద్ద అడుగొడి స్టేషన్‌లోని పోలీస్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 11.40 సమయంలో వేగంగా దూసుకువస్తున్న హోండా సిటీ కారు.. బారికేడ్లను ఢీకొట్టింది. అందులో ఉన్న తౌహీద్ 'సేవ్.. సేవ్.. సేవ్..' అని అరిచాడు. దీంతో అది కిడ్నాప్ అని గ్రహించిన ఇన్స్పెక్టర్... ఆ కార్‌ను సినీ ఫక్కీలో ఛేజ్ చేశాడు. 2 కిలో మీటర్ల ఛేజ్ అనంతరం కిడ్నాపర్ల కారును ఆపారు. దీంతో అందులో ఉన్న నలుగురు నిందితుల్లో ముగ్గురు పారిపోయారు. గోపి అనే మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తౌహీద్‌ను సురక్షితంగా కాపాడిన పోలీసులు.. అతడి కుటుంబసభ్యులకు అప్పిగించారు. కాగా, తౌహీద్ వచ్చే వరకు మల్దివాలా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు అతడి కుటుంబ సభ్యులు.