దేశంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు మత, సామాజిక సంస్థల ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టీకాలపై అవగాహన కల్పిస్తూ.. వ్యాక్సిన్‌పై ఉన్న సంకోచాన్ని తొలగించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. అలాగే.. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. 'యునైట్ ఇండియా మూవ్మెంట్' ద్వారా యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' నినాదంతో నిజమైన స్ఫూర్తిని ప్రతిఒక్కరికి తెలియజేయాలని కోరారు.
" ఈ చర్చలు భారత్ ఒకే సమాజం అనటానికి మరో ఉదాహరణ. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అందరిని కలుపుకొని పని చేస్తోంది. మతాలు, ప్రాంతాల హద్దులను చెరిపేసి కొవిడ్ సమయంలో ఇతరులకు సాయం చేయటం ఏక్ భారత్-ఏక్ నిష్ఠా ప్రయాస్కు ఉదాహరణ. దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు ఆసుపత్రులు, ఐసోలేషన్ కేంద్రాలుగా మారాయి. అవసరమైన వారికి ఔషధాలు, ఆహార పదార్థాలను అందించాయి. ప్రతిఒక్కరికి వ్యాక్సిన్ అనే ప్రచారం కొవిడ్ నుంచి రక్షణగా నిలుస్తోంది. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ప్రయత్నాల్లో మత, సంఘాల నాయకులు చేతులు కలపాలి. టీకాలపై ఉన్న రూమర్లు, సందేహాలను నివృత్తి చేసే పోరాటంలో సాయం చేయాలి. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
టీకాలపై ప్రజల్లో ఆందోళనలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు మోదీ. ప్రతి ఒక్కరి వద్దకు ఆరోగ్య సిబ్బంది చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సూచించారు. 75వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రతిఒక్కరు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్‌లో పాలుపంచుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా తమతో మాట్లాడినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నేతలు. కొవిడ్ కట్టడిలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. కొవిడ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ మతాలు, సామాజిక సంస్థలు చేసిన సేవలను మోదీకి వివరించారు.
ఇదీ చూడండి: 'కొవిడ్ కట్టడిలో సంతృప్తికి స్థానం లేదు'