water crisis in melghat: ఎండల తీవ్రత కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు నీటి కోసం అల్లాడిపోతున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల ప్రజలు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళుతున్నారు. అడుగంటిన బావుల్లోకి దిగి నీటిని చేదుకుంటున్నారు. మహారాష్ట్రలోని ఓ గ్రామంలోనూ బావి అంచున ప్రమాదకర రీతిలో నిల్చొని నీటి కోసం కొట్లాడుకుంటున్నారు.
మేల్ఘాట్లోని ఖడియాల్ గ్రామంలో చుక్క నీరు దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే తాగడానికి చుక్క నీరు లేక అల్లాడిపోతున్నారు. మూడు ట్యాంకర్ల నీటిని తీసుకొచ్చి గ్రామంలో ఎండిపోయిన బావిలో పోసి వాడుకుంటున్నారు. బావి అంచున గుంపులు గుంపులుగా నిల్చొని తాళ్ల సాయంతో నీటిని తోడుకునేందుకు జనం పోటీ పడుతున్నారు.
"ఓట్ల కోసం నాయకులందరూ వస్తారు. కానీ మా సమ్యలు పరిష్కరించడానికి ఎవరు రావడం లేదు. మా గ్రామంలో నీటి సమస్య ఎలా ఉందో అలానే ఉంది. అపరిశుభ్ర నీటిని తాగడం వల్ల ప్రజల అనారోగ్యం పాలవుతున్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోతున్నారు. మాకు నీళ్లు, రోడ్డు, విద్యుత్ కావాలి."
-కృష్ణ, గ్రామస్థుడు
అపరిశుభ్రమైన నీటిని తాగడం వల్ల గ్రామంలోని చాలా మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాణాలు ఫణంగా పెట్టి.. బావుల నుంచి నీటిని చేదుకుంటున్నట్లు పలువురు చెబుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని బావి వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని.. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ట్యాంకర్లు కూడా రావడం లేదని గ్రామస్థులు వాపోయారు. ఎన్నికల సమయంలో నాయకులు వస్తారని.. తమ సమస్యలు పరిష్కరించడానికి ఒక్కరూ రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ నీటి కష్టాలను తీర్చాలని జనం వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో పలువురు గవర్నర్లు.. తమిళిసై కూడా!