UP election 2022: 'దేశ గతిని నిర్ణయించే ఎన్నికలు'... 'కేంద్రంలో చక్రం తిప్పేదెవరో తేల్చే ఎలక్షన్లు'... అంటూ ఉత్తర్‌ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు సైతం చకచకా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎప్పుడో ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ప్రధాని మోదీ ఇప్పటికే అనేక సార్లు యూపీని చుట్టేశారు. మిగిలిన పార్టీలు సైతం.. మేమేం తక్కువేం కాదన్నట్లు భారీ సభలు నిర్వహిస్తున్నాయి.
UP political rallies Omicron
అయితే హుషారుగా సాగుతున్న ఈ ఎన్నికల ప్రచారానికి కరోనా ఆటంకం కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులతో.. రాజకీయ పక్షాలు వెనక్కి తగ్గకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనేక బహిరంగ సభలను ఆయా పార్టీలు రద్దు చేసుకుంటున్నాయి.
Congress cancels UP election rallies
ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుస పెట్టి ర్యాలీలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బాలికలకు ప్రత్యేకంగా పరుగుపందేలను నిర్వహిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. యూపీలో ఎలాంటి మారథాన్లు నిర్వహించకూడదని బుధవారం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆజంగఢ్, వారణాసి, గాజియాబాద్, అలీగఢ్‌లలో ఈ వారం జరగాల్సి ఉన్న నాలుగు పోటీలను సైతం రద్దు చేసింది. బరేలీలో మంగళవారం నిర్వహించిన పోటీల్లో తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తడం కూడా ఈ మారథాన్ల రద్దుకు కారణమని తెలుస్తోంది.
అప్పటివరకు అంతే...
కరోనా పరిస్థితి మెరుగుపడేంతవరకు పెద్ద పెద్ద ఎన్నికల ర్యాలీలు నిర్వహించకూడదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, యూపీ వ్యవహారాల బాధ్యురాలు ప్రియాంకా గాంధీ ఆదేశించారని ఆ పార్టీ ప్రతినిధి లలన్ కుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాలను పరిమితంగానే నిర్వహించనున్నట్లు తెలిపారు. వీధి ప్రదర్శనలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత అశోక్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విధంగా చిన్న చిన్న కార్యక్రమాలతోనే ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.
UP election 2022 political rallies
యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చించి.. ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి సామాజిక మాధ్యమాలు, వర్చువల్ మీడియాలోనే ప్రచారం నిర్వహించడంపై దృష్టి సారించనున్నామని పేర్కొన్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించనున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తెలిపారు.
రాజకీయ పార్టీలు చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్రోత్సహించాలని ఇటీవలే ఎన్నికల సంఘాన్ని కోరింది కాంగ్రెస్. సభలకు హాజరయ్యే ప్రజలకు మాస్కులు పంపిణీ చేసేలా ఆదేశించాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, పార్టీ శాసనపక్షనేత ఆరాధనా మిశ్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
మోదీ సభలూ రద్దు..!
మరోవైపు, భాజపా సైతం తన ర్యాలీలను రద్దు చేసుకోక తప్పడంలేదు! ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల నమోదును దృష్టిలో ఉంచుకొని పెద్ద ర్యాలీల నిర్వహణపై కమలదళం పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రధాని హజరయ్యే పలు పెద్ద ర్యాలీలు రద్దు చేయాలని భాజపా యోచిస్తున్నట్లు సమాచారం. జనవరి 9న జరగాల్సిన మోదీ లఖ్‌నవూ సభ ఇప్పటికే రద్దు కాగా... ఇతర సమావేశాలపైనా త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ లఖ్‌నవూ సభను అతి పెద్ద కార్యక్రమంగా నిర్వహించాలని అనుకున్నారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు వస్తారని భావించారు.
సమావేశాల రద్దుకు కరోనాతో పాటు తాత్కాలిక కారణాలూ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ వారంలో నిర్వహించే పలు ర్యాలీలు రద్దు చేయవచ్చని భాజపా వర్గాలు చెబుతున్నాయి.
'సోషల్ మీడియా ఉందిగా..!'
మరోవైపు, దేశంలో కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ సభలను వెంటనే నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ లేఖ రాశారు. ర్యాలీలు, బహిరంగ సభలకు బదులుగా.. ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం ద్వారా ఎన్నికల ప్రచారాలు చేపట్టాలని సూచించారు.
"రాజ్యాంగ నిబంధనల కారణంగా ఎన్నికలను వాయిదా వేయడం కుదరదు. కానీ, కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల సంఘం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పార్టీల ర్యాలీలను వెంటనే నిలిపివేయాలి. ప్రచారంలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు లభించేలా.. టీవీ ఛానళ్లు, రేడియో, ఇతర మాధ్యమాల్లో నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇంటింటి ప్రచారం నిర్వహించుకునేలా చేయాలి."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం
కరోనా మహమ్మారి వ్యాప్తి ఇలాగే కొనసాగితే.. ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిరాడంబరంగానే జరిగే అవకాశం ఉంది. జనసమీకరణలు, భారీ బహిరంగ సభలు లేకుండానే ప్రచారం జరగనుంది. మరి అన్ని రాజకీయ పార్టీలు ఆన్లైన్ ప్రచారానికే మొగ్గు చూపితే.. ఎవరికి మేలు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: