Foul Smell Form Train Coach : ఒడిశాలో రైలు దుర్ఘటన జరిగి వారం రోజులు గడిచింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు సమస్యలతో స్థానిక బహనగా బజార్ స్టేషన్ ప్రజలు ఇబ్బింది పడుతున్నారు. ప్రమాదానికి గురైన యశ్వంత్‌పుర్-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన ఓ బోగీలో ఇంకా కొన్ని మృతదేహాలు ఉన్నాయని.. అందుకే అక్కడి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రైల్వే శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో బహనగా బజార్ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించింది. అది మృతదేహాల దుర్వాసన కాదని.. పాడైపోయిన కోడిగుడ్ల వాసన అని స్పష్టం చేసింది.
ఈ మేరకు మీడియోతో మాట్లడిన సౌత్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్ఓ (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) ఆదిత్య కుమార్ చౌదరి.. ఎన్డీఆర్ఎఫ్ రెండు సార్లు సైట్ క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. దాదాపు 3 టన్నుల కోడి గుడ్లు యశ్వంత్‌పుర్-హావ్‌డా ఎక్స్‌ప్రెస్ పార్సిల్ వ్యాన్‌లో ఉన్నాయని.. అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని చెప్పారు. ఆ కుళ్లిపోయిన గుడ్లను మూడు ట్రాక్టర్లతో తొలగించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా బాలేశ్వర్ రైలు దుర్ఘటనకు సంబంధించిన 661 మంది బాధితులకు రూ. 22.66 కోట్ల పరిహారం అందజేశామని చెప్పారు. మృతిచెందిన వారికి రూ. 10 లక్షల చొప్పున ఇచ్చామని తెలిపారు.
Bahanaga School Demolished : ఇదిలా ఉంటే.. రైలు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను బహనగా ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. ఆ బడిని తాత్కాలిక మార్చురీగా మార్చి మృతదేహాలను భద్రపరిచారు. దీంతో ఆ పాఠశాలలోకి వెళ్లడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేశారు. అనంతరం తమ ఇబ్బందిని అధికారులకు తెలియజేశారు. దీంతో స్థానిక అధికారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు రెండు కమిటీలుగా ఏర్పడి ఆ పాఠశాలను సందర్శించారు. అందులో భాగంగా బాలేశ్వర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ శిందే గురువారం పాఠశాలను పరిశీలించారు. ఆ తర్వాత కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు.
పాఠశాల నిర్మించి 65 ఏళ్లు అవుతుండటం, శిథిలావస్థకు చేరడం.. దానికి తోడు రైలు దర్ఘటన మృతదేహాలను భద్రపరచడం వల్ల కూల్చివేతకు త్వరగా అనుమతులు మంజూరయ్యాయి. అయితే, కూల్చిన భవనం ప్రదేశంలో మరో కొత్త భవనం నిర్మిస్తామని.. అప్పుడు విద్యార్థులు ఏ భయం లేకుండా పాఠశాలకు వస్తారని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
Odisha Train Tragedy : జూన్ 2న బాలేశ్వర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లూప్‌లైన్‌లో ఆగిన గూడ్స్ రైలును.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. దాని బోగీలు ఎగిరి పక్కనున్న పట్టాలపై పడడ్డాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తోన్న బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 288 మంది మరణించారు. 1,200 మందికి పైగా గాయాలపాలయ్యారు.