Odisha Train Accident Death : గతవారం ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 278 మంది మరణించగా, వారిలో కనీసం 40 మంది విద్యుత్ షాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మేరకు సహాయక చర్యలను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
Odisha Train Crash Electric Shock : ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. పట్టాలు తప్పిన బోగీల్లోంచి మృతదేహాలను బయటకు తీశారు. అందులో కనీసం 40 మృతదేహాలపై గాయాలు, రక్తస్రావం కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. తమ ఎఫ్ఐఆర్లో ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడడం వల్ల.. విద్యుత్ షాక్ తగిలిందని రైల్వే పోలీసులు తెలిపారు.
Odisha Train Tragedy : 'కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి గూడ్స్ రైలును ఢీకొనడం వల్ల పట్టాలు తప్పాయి. అదే సమయంలో ఆ మార్గంలో బెంగళూరు-హావ్డా ఎక్స్‌ప్రెస్ రాగానే.. కోరమాండల్ బోగీలు ఆ రైలుపై పడ్డాయి. దీంతో బెంగళూరు-హావ్డా ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు ఓవర్ హెడ్ లోటెన్షన్ లైన్ విద్యుత్ వైర్లు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో విద్యుత్ షాక్ కూడా సంభవించింది. బోగీల మధ్య నలిగిపోవడం వల్ల చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. రక్తస్రావం జరిగిన ఆనవాళ్లు లేవు. బోగీలపై లోటెన్షన్ వైర్లు పడి విద్యుత్ ప్రసరించడం వల్ల వీరంతా కరెంట్ షాక్ గురై మృత్యువాత పడి ఉండొచ్చని భావిస్తున్నాం' అని ఓ అధికారి తెలిపారు.
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొనడం వల్ల కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ ఏకంగా గూడ్స్ రైలు పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో చనిపోయిన 278 మంది మృతదేహాల్లో 100 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. వీటిని వివిధ ఆసుపత్రుల మార్చురీల్లో భద్రపరిచారు. ఈ మృతదేహాలను ఎక్కువ కాలం భద్రపరచడం మంచిది కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంధువులను గుర్తించేందుకు వీలుగా మృతదేహాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తున్నారు.
నీరు కూడా నెత్తురులా కనిపిస్తోంది!
Odisha Train Accident 2023 : ఒడిశాలో జరిగిన ఘోర దుర్ఘటన గురించి సమాచారం అందుకున్న క్షణం నుంచి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. చుట్టూ చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు.. ఎటు చూసినా ఎర్రటి రక్తం.. కాపాడాలంటూ క్షతగాత్రుల ఆర్తనాదాలు.. ఇలాంటి పరిస్థితుల్లో మనసు దృఢంగా మార్చుకొని సహాయక చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్. ఎంతటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయినా.. వాళ్లూ మనుషులే కదా! ఆ ఘోర విపత్తు దృశ్యాలను దగ్గరి నుంచి చూసి మానసికంగా కుంగిపోయారు. నాలుగు రోజుల పాటు రక్తాన్ని చూసి.. నెత్తురే వారి మనసులో మెదులుతుండటం వారి దీని స్థితికి అద్ధం పట్టింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.