ఆన్లైన్ వేదికగా పరిచయం, ప్రేమ, పెళ్లి.. అనేవి తరచూ వింటూనే ఉన్నాం. అయితే.. ఆన్లైన్ గేమింగ్ యాప్లో పరిచయమైన ఓ యువకునితో ప్రేమలో పడిన ఓ యువతి(19).. అతడిని పెళ్లి కూడా చేసుకుంది. కానీ అతడికి పెళ్లి వయస్సు రాలేదనే సమాచారం అందుకున్న అధికారులు.. వారి వివాహం చెల్లదని తేల్చి చెప్పారు.
ఒడిశా టు హరియాణా..
ఒడిశాకు చెందిన ఓ యువతికి.. హరియాణాలోని పానిపత్కు చెందిన ఓ యువకునితో లూడో గేమింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి.. పెళ్లి చేసుకునేవరకు దారితీసింది. అయితే యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీనితో ఇంట్లో నుంచి పానిపత్కు పారిపోయి పెళ్లి చేసుకుంది ఆ యువతి. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాల్య వివాహాల నిషేధ అధికారి రజనీ గుప్తా తన బృందంతో అక్కడకు చేరుకుని వివాహాన్ని నిలిపేశారు.
"ఆన్లైన్లో లూడో గేమ్ ఆడుతుండగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరికీ రెండేళ్లుగా పరిచయం ఉంది. యువతి కుటుంబ సభ్యులెవరూ వివాహానికి హాజరుకాలేదు. ఆమె తల్లికి ఈ వివాహం ఇష్టం లేదు. అక్టోబర్ 2న ఈ యువతి తన అక్కకు సమాచారం అందించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది."
-రజనీ గుప్తా, బాల్య వివాహాల రక్షణ అధికారి
'సోమవారం పానిపత్లో అబ్బాయి ఇంట్లో వివాహం జరుగుతోందనే సమాచారం అందింది. చట్టప్రకారం వరుడి వయసు వివాహానికి సరిపోదు. అందుకే ఈ పెళ్లిని నిలిపేశాం' అని రజనీ గుప్తా తెలిపారు. 'యువకుడి వయస్సు 20 సంవత్సరాల 8 నెలలని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే.. ధ్రువీకరణ పత్రాలు చూపించడంలో విఫలమయ్యారు' అని ఆమె వివరించారు.
ప్రస్తుతం మన దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సు 18 కాగా.. అబ్బాయిలకు 21 ఏళ్లు నిండాలి.
ఇవీ చదవండి: