జమ్ముకశ్మీర్‌లోని నిషేధిత మత సంస్థ జమాత్-ఏ-ఇస్లామీ(జేఈఎల్)కి చెందిన సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆదివారం విస్తృత సోదాలు నిర్వహించింది. జేఈఎల్ సభ్యులు ఇళ్లు, కార్యాలయాలు కలిపి 45 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిందని అధికారులు చెప్పారు. కశ్మీర్‌లోని అన్ని జిల్లాలు, రంబాన్, కిష్ట్వార్, దోడా, రౌజౌరీ సహా జమ్ములోని కొన్ని జిల్లాలో ఈ గాలింపు చర్యలు చేపట్టిందని వెల్లడించారు.
రెండేళ్ల క్రితమే నిషేధం..
ఉగ్రవాదులతో సన్నిహత సంబంధాలు ఉండటం సహా వేర్పాటువాద ఉద్యమాన్ని బలపరుస్తున్నారన్న కారణంతో ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జేఈఎల్పై 2019 ఫిబ్రవరిలో ఐదేళ్లపాటు కేంద్రం నిషేధం విధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశం అనంతరం కేంద్రం హోం శాఖ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తదనంతరం.. చెలరేగిన అలర్లలో వందలాది మంది జేఈఎల్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో ఎన్ఐఏ తాజా సోదాలను నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సంస్థ సభ్యులు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతన్నారని నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు.
బెంగళూరులోనూ..
బంగ్లాదేశ్‌కు చెందిన మానవ అక్రమ రవాణాదారుల కోసం, వారి బాధితుల కోసం నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకునేందుకు కర్ణాటక బెంగళూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో శనివారం ఈ తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు.
ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి..
మానవుల అక్రమ రవాణాకు పాల్పడతున్నారని 13 మంది నిందితులపై బెంగళూరులోని రామ్మూర్తి నగర్ పోలీసులు జూన్‌లో కేసు నమోదు చేశారు. వారి చెర నుంచి ఏడుగురు బంగ్లాదేశీ మహిళలను, ఓ చిన్నారిని పోలీసులు రక్షించారు. ఈ మహిళలను బంగ్లాదేశ్ నుంచి ఉద్యోగం పేరుతో నిందితులు తీసుకువచ్చి, వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.
దీనిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా శనివారం ఈ సోదాలు నిర్వహించింది. నేర సంబంధిత పత్రాలు సహా ఆరు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ఇదీ చూడండి: 'కశ్మీరీల బాధను మాటల్లో చెప్పలేం'
ఇదీ చూడండి: ఉగ్రదాడిలో పోలీసు మృతి, మరో ఇద్దరికి గాయాలు