అది 2008 నవంబరు 26..
సమయం: రాత్రి 8 గంటలు..
ప్రదేశం: ముంబయిలోని కొలాబా సముద్రతీరం..
10 మంది గుర్తుతెలియని వ్యక్తులు స్పీడ్‌బోట్లలో అక్కడకు చేరుకొన్నారు. ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు. అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు.
సమయం: రాత్రి 9.30 గంటలు
ప్రదేశం: ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్
రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోకి ఇద్దరు ముష్కరులు చొరబడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి వద్ద ఉన్న ఏకే-47 తుపాకులు నిప్పులు కక్కాయి. ప్రజలపై తూటాల వర్షం కురిసింది. కన్పించిన వారిని పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని దాడికి ప్రజలు అల్లాడిపోయారు. భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడి నుంచి పారిపోయిన ముష్కరులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అనేకమంది ప్రజలు క్షతగాత్రులయ్యారు.
గ్రామానికి అమరుడి పేరు..
2008 నవంబర్ 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడితో యావత్ ప్రపంచం వణికిపోయింది. ఆ మారణహోమం జరిగి శనివారానికి 14 ఏళ్లు పూర్తికావొస్తుంది. ఈ ఘటనలో అమరుడైన ఒక కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన జన్మించిన ఊరికి ఇప్పుడు ఆయన పేరునే పెట్టనున్నారు.
మహారాష్ట్రలోని సుల్తాన్‌పుర్‌కు చెందిన రాహుల్ షిండే.. ఆ రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ దళానికి నవంబర్ 26న తాజ్ హోటల్‌లో జరుగుతున్న ఉగ్రదాడి గురించి సమాచారం అందింది. అక్కడ ఉన్న సామాన్య ప్రజలను రక్షించేందుకు వెళ్లిన మొదటి రక్షణ బృందంలో రాహుల్ కూడా ఉన్నారు. ఉగ్రమూకలతో పోరాడే క్రమంలో ఆయన పొట్టలో ఒక బుల్లెట్ దిగడం వల్ల ప్రాణాలు కోల్పోయారు.
ఆయన త్యాగాన్ని గుర్తించిన ప్రభుత్వం మరణాంతరం ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఇచ్చి గౌరవించింది. ఇప్పుడేమో ఆయన గౌరవార్థం తన స్వగ్రామం సుల్తాన్‌పుర్‌ను రాహుల్ నగర్‌గా మార్చనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతులన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు అధికారికంగా పేరు మార్చే కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నట్లు షిండే తండ్రి మీడియాకు వెల్లడించారు. పది సంవత్సరాలుగా దీనికోసం ప్రయత్నిస్తున్నానని, ఇప్పటికి అనుమతులు వచ్చాయని వెల్లడించారు. 'మా ఊరికి నా బిడ్డ పేరు ఉండటం నాకెంతో గర్వంగా ఉంది' అని ఉద్వేగానికి గురయ్యారు.