ఓ 15ఏళ్ల బాలిక ఏడేళ్ల క్రితం అదృశ్యమయ్యింది. ఆమెను కిడ్నాప్ చేశాడనే అభియోగాలపై ఓ యువకుడు అరెస్టయ్యాడు. ఆమె మరణించిందని దర్యాప్తులో పోలీసులు తేల్చడం వల్ల నిందితుడికి శిక్ష కూడా పడింది. అయితే, చనిపోయిందని భావించిన ఆ యువతి (22) తాజాగా బతికుండటాన్ని బాధితుడి తల్లి గుర్తించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడం వల్ల రంగంలోకి దిగి ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.
యూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ బాలిక 2015లో కనిపించకుండా పోయింది. దీంతో స్థానిక గోండా పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్, బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం వంటి అభియోగాలపై ఓ యువకుడిపై కేసులు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత ఆగ్రాలో ఓ యువతి హత్యకు గురైందన్న విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి.. అది తన కూతురేనని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు హత్య కేసుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో విష్ణు( ప్రస్తుతం 25 ఏళ్లు) అనే యువకుడిపై అభియోగాలు మోపడం వల్ల అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
అయితే, పోలీసుల దర్యాప్తుపై మొదటినుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిందితుడి తల్లి.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సొంత ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో హథ్రాస్‌లో ఇటీవల ఓ మతపరమైన కార్యక్రమంలో ఏడేళ్ల క్రితం తప్పిపోయిన ఆ యువతి ఈ మహిళ కంటపడింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసింది.
దీంతో ఆ యువతిని అలీగఢ్‌లో అదుపులోకి తీసుకొని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు తొలుత డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. యువతితోపాటు ఆమె తల్లిదండ్రుల నమూనాలను సేకరించామని.. డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. 'నా కుమారుడిని ఈ కేసులో ఇరికించారని నాకు తెలుసు. తనను నిర్దోషిగా నిరూపించేందుకే సొంతంగా ప్రయత్నాలు చేస్తున్నాను' అని నిందితుడి తల్లి చెప్పారు.