ఉత్తర్‌ప్రదేశ్ షామ్లీలో ఓ మహిళ భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలకు ఎలుకల మందు పెట్టి చంపింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
కైరానా కొత్వాలి ప్రాంతంలోని పంజిత్ గ్రామానికి చెందిన ముర్సలిన్ అనే వ్యక్తికి ముజఫర్‌నగర్ జిల్లా సర్వత్ గ్రామానికి చెందిన సల్మాతో 2011లో వివాహం జరిగింది. ముర్సలిన్.. దిల్లీలో ఓ ఫర్నీచర్ షాప్‌లో పనిచేస్తున్నారు. అతని భార్య సల్మా, నలుగురు పిల్లలు తమ గ్రామంలోనే ఉంటున్నారు. అయితే భర్తతో గొడవపడిన సల్మా.. కుమారుడు సాద్(8), ఇద్దరు కుమార్తెలు మిస్బా(4), మంటషా(2)లకు బుధవారం నీళ్లలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్పృహ తప్పిపోయిన పిల్లలను బంధువులు చూసి తండ్రి ముర్సలిన్కు తెలియజేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో చిన్నారి సాద్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాలికలిద్దరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఉన్నత కేంద్రానికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మిస్బా మార్గమధ్యలోనే మృతి చెందింది. మేరఠ్ మెడికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సాయంత్రం 6 గంటల సమయంలో మంటషా కూడా మరణించింది. భర్త ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
నిందితురాలు మొదట తన నేరాన్ని అంగీకరించలేదు. అయితే పోలీసులు గట్టిగా అడిగేసరికి చేసిన దారుణమైన నేరాన్ని ఒప్పుకుంది. నెలన్నర రోజుల నుంచి తన భర్త ఇంటికి రాలేదని నిందితురాలు తెలిపింది. ఈ ఘటనకు ముందు రోజు భర్తతో ఫోన్లో మాట్లాడి.. ఇంటికి వచ్చి ఖర్చులు చెల్లించమంది. అయితే భర్త ఇంటికి రావటానికి నిరాకరించేసరికి పిల్లలకు విషం ఇస్తానని బెదిరించింది. భర్త ఆమె మాటలు పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసేశాడు. కానీ భార్య మాత్రం అన్నంతపనే చేసింది. షాప్‌కు వెళ్లి ఎలుకల మందు తీసుకుని వచ్చి పిల్లలకు నీళ్లలో కలిపి తాగించింది.
అయితే అదృష్టవశాత్తు ఇంట్లో లేని మరో ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దంపతులకు ఏడాదిన్నర క్రితం ఇద్దరు కవలలు ఒక పాప, బాబు పుట్టగా సరిగ్గా చూసుకుని పెంచేందుకు వారిలో ఒక బాబు మూసాను పుట్టింటివారికి పంపించింది. ఆ చిన్నారి ఇప్పుడు నలిహాల్లో ఉన్నాడు. మరో చిన్నారి జైనాబ్ చదువుకునేందుకు బయటకు వెళ్లింది. ఈ ఘటనలో పోలీసులు నీళ్లతో నిండిన స్టీల్ మగ్గును, పిల్లల వాంతిలతో తడిచిన బట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్టీల్ జగ్గులో తెల్లటి పొడి తేలుతూ కన్పిస్తోందని పోలీసులు తెలిపారు.
స్కూల్ టీచర్.. అనుమానాస్పద మృతి..
మరోవైపు యూపీ, నోయిడా, సెక్టార్ 46లోని గార్డెనియా గ్రోరీ సొసైటీలో నివసిస్తున్న స్కూల్ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలిని పారుల్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. ఆమె దిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేసేది. గార్డేనియాలోని టవర్ ఏ-2 నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.