ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఏ పార్టీకీ రాలేదు. అయితే.. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 26 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షం ఎన్పీపీని వీడి ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 2 సీట్లకే పరిమితమైంది.
మేఘాలయ ఎన్నికల ఫలితాలు..
- ఎన్పీపీ-26
- యూడీపీ-11
- కాంగ్రెస్-5
- టీఎంసీ-5
- భాజపా-2
- ఇతరులు-11
ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఫోన్ చేశారు. ఈ విషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. తన చరిష్మా రాష్ట్రంలో తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు. దక్షిణ తురా నియోజకవర్గం నుంచి ఆయన 2,830 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరణే లక్ష్యంగా పెట్టుకున్న తృణమూల్ కాంగ్రెస్ 5 సీట్లలో గెలుపొందింది. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా.. గతేడాది 12 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ను వీడారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనపై టీఎంసీ భారీ ఆశలు పెట్టుకుంది. ముకుల్ సంగ్మా అధ్యక్షతన ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఆశపడింది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను రాబట్టలేక చతికిలపడిపోయింది. 5 సీట్లలో హస్తం పార్టీ విజయం సాధించింది. యూడీపీ 11 సీట్లలో గెలుపొందింది.
ఓటమి నేర్పిన పాఠం..
కాన్రాడ్ సంగ్మా.. మొదటి సారి 2004 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిమిపాలయ్యారు. అయినా కాన్రాడ్ సంగ్మా కుంగిపోలేదు. ఓటమి నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి రెండో సారి మేఘాలయకు ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదిగారు. తన తండ్రి పీఏ సంగ్మా దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకుని.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు దిగ్గజ నేతగా ఎదిగారు.
కాన్రాడ్ సంగ్మా రాజకీయ జీవితం..
- 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
- 2009 వరకు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు
- 2009 నుంచి 2013 వరకు ప్రతిపక్ష నేత
- తండ్రి పీఏ సంగ్మా మరణంతో 2016లో ఎన్పీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు
- 2016లో తురా నుంచి లోక్సభకు ఎన్నిక
ఇవీ చదవండి: