Manipur assembly polls: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఆరు జిల్లాల్లోని మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 92 మంది అభ్యర్థులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో ఇద్దరే మహిళలు ఉండటం గమనార్హం. 8.38 లక్షల మంది ఓటర్లు.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
![Manipur assembly polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14642230_polls.jpg)
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 22 నియోజకవర్గాల్లో 1247 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరుగుతోంది. కొవిడ్-19 నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందులో 223 పోలింగ్ కేంద్రాలు పూర్తిగా మహిళలతోనే నిర్వహిస్తున్నారు. తొలి విడతలో మాదిరిగా ఘర్షణలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.
![Manipur assembly polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14642230_polls2.jpg)
ఓటు వేసిన మాజీ సీఎం..
రెండో దశ పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు.. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటు వేశారు మాజీ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబి సింగ్. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
![Manipur assembly polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14642230_okram-ibobi-singh.jpg)
ప్రముఖులు..
మాజీ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబిసింగ్, ఆయన కుమారుడు సూరజ్‌కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి గైఖాంగమ్ తదితర ప్రముఖులు రెండో దశలో బరిలో ఉన్నారు.
ఈ విడతలో మొత్తం 22 స్థానాలకుగాను.. భాజపా అన్నింటా పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 18, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 11, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) 10, జనతాదళ్ (యునైటెడ్) 10 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి.
![Manipur assembly polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14642230_polls1.jpg)
12 కేంద్రాల్లో రీపోలింగ్..
రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 28న చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. ఈ దశలో హింసాత్మక ఘటనలు చెలరేగి ఈవీఎంలు ధ్వంసం కాగా.. 12 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్‌కు ఆదేశించింది ఎన్నికల సంఘం. ఆ పోలింగ్ స్టేషన్లలోనూ రెండో దశలో (శనివారం) పోలింగ్ జరుగుతోంది.
ఇదీ చూడండి: ఉక్రెయిన్‌లో నుంచి తిరిగొచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులకు కేంద్రం ఊరట